రెవెన్యూ కోర్టులు రద్దు

9 Sep, 2020 06:37 IST|Sakshi

ఇకపై జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్‌ 

తహసీల్దార్‌ నుంచి అదనపు కలెక్టర్‌ వరకు కోర్టులకు చెల్లుచీటీ 

ట్రిబ్యునల్‌కు రిటైర్డ్‌ జడ్జి సారథ్యం 

సాధారణ కేసుల పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో అధికారి 

కొత్త రెవెన్యూ చట్టంలో కీలక సంస్కరణలు చేయాలని ప్రభుత్వ నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూ కోర్టులకు ఇక చెల్లుచీటీ పడనుంది. భూ వివాదాల పరిష్కారానికి ప్రతి శనివారం తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్‌ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఈ రెవెన్యూ కోర్టులను నిర్వహించేవారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయానికి మంగళం పాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం శాసనసభ ముందుకు రానున్న భూ యాజమాన్య హక్కుల చట్టం–2020 (ఆర్‌ఓఆర్‌) బిల్లులో పొందుపరిచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటివరకు మండల స్థాయిలో తహసీల్దార్‌.. ఆపై అప్పిలేట్‌ అధికారిగా ఆర్డీవో.. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్‌ భూ వివాదాలపై తీర్పులు చెప్పేవారు. ఈ క్రమంలో వివాదాల పరిష్కారానికి ఎడతెగని జాప్యం జరగడం, మితిమీరిన అవినీతి ఆరోపణలు రావడంతో వీటిని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రెవెన్యూశాఖ అధికారుల అధికారాలకు కత్తెరపడనుంది. ఈ క్రమంలోనే రెవెన్యూ కోర్టులను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది.  

కొత్తగా ట్రిబ్యునల్‌... 
రెవెన్యూ కోర్టులకు రాంరాం చెబుతున్న ప్రభుత్వం దాని స్థానే జిల్లాకో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రిటైర్డ్‌ జడ్జి స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసే ఈ ట్రిబ్యునల్‌.. ఇకపై మండలం నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని భూ వివాదాలను పరిష్కరించనుంది. దీంతో ఇప్పటివరకు మూడంచల వ్యవస్థకు కాలం చెల్లనుంది. ట్రిబ్యునల్‌ ఇచ్చే తీర్పులపై సంతృప్తి చెందని కక్షిదారులు కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకునే వెసులుబాటు కల్పించేలా కొత్త చట్టంలో ప్రభుత్వం మార్పులు చేయనున్నట్లు తెలిసింది. అలాగే, సేవలను సులభతరం చేయడంలో భాగంగా ఇకపై తహసీల్దార్, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్ల పాత్రను కూడా పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి మరో అధికారి 
రెవెన్యూశాఖలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి (అర్జీలతో సహా) జిల్లా స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణాధికారిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లు, విరాసత్, కల్యాణలక్ష్మి–షాదీముబారక్, కుల, ఆదాయ, నివాస, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, ఆస్తుల భాగాల పంపిణీ వ్యవహారాలను కొలిక్కి తెచ్చే బాధ్యతను ఈ అధికారికి అప్పగించనున్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో చర్చించి ఈ అర్జీలకు పరిష్కారమార్గం చూపేలా వ్యవహరించనున్నారు. 

పేర్లలోనూ మార్పులు... 
వీఆర్వో వ్యవస్థకు స్వస్తి పలికిన సర్కారు.. అధికారాల కూర్పు, పేర్ల మార్పుపైనా ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే తహసీల్దార్‌ మొదలు కలెక్టర్‌ వరకు రెవెన్యూ అధికారాలను సాధ్యమైనంత వరకు తగ్గించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పోస్టులను కూడా పునఃనిర్వచిస్తూ కొత్త చట్టంలో పొందుపరిచినట్లు సమాచారం. జిల్లా పాలనాధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్‌ అనే పదానికి బదులుగా ఇకపై జిల్లా మేజిస్ట్రేట్‌గా పిలవనుంది. అదనపు కలెక్టర్‌ను ఇకపై అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా వ్యవహరించనుంది. తహసీల్దార్‌ను తహసీల్దార్‌/ భూ మేనేజర్‌గా నిర్వచించే అంశాన్ని పరిశీలిస్తోంది.   

>
మరిన్ని వార్తలు