జరిమానా కట్టకపోతే వేలమే!

27 Apr, 2022 02:46 IST|Sakshi

జీఎస్టీ చట్టం కింద సీజ్‌ చేసిన వస్తువులపై ప్రభుత్వ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సరిగా చెల్లించనందుకు గాను సీజ్‌ చేసిన వస్తువులకు సంబంధించిన జరిమానాను నిర్దేశిత గడువులోపు వ్యాపారులు చెల్లించకపోతే ఆ వస్తువులను లేదా సరుకులను వేలంలో అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 129 (1) ప్రకారం జరిమానా విధించిన 15 రోజుల్లో చెల్లించకపోతే ఆ సరుకులను ఈ వేలంలో అమ్మేసేందుకు పన్నుల శాఖ అధికారులకు అనుమతినిచ్చింది.

జరిమానాను సకాలంలో చెల్లించకపోతే డీలర్‌కు నోటీసులివ్వాలని, నోటీసులు ఇచ్చాక 15 రోజుల్లోపు వేలంలో పాల్గొనేవారి నుంచి బిడ్లు స్వీకరించాలని, బిడ్లలో అర్హత పొందిన వారికి వస్తువులను అమ్మేసి ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని వసూలు చేయాలని, మిగిలిన బిడ్లు దాఖలు చేసిన వారి ఫీజు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది. సీజ్‌ చేసిన వస్తువులు 15 రోజుల్లోపు అమ్మాల్సిన స్వభావం కలిగి ఉంటే షెడ్యూల్‌ను నిర్ణీత అధికారి మార్చుకునే వెసులుబాటు కల్పించింది. అయితే నోటీసు జారీ చేయడానికి ముందే ఆ వస్తువులను భద్రపరిచేందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వానికి డీలర్‌ చెల్లిస్తే వేలం ప్రక్రియను నిలిపివేయనుంది.  

ఐటీసీకి కొత్త నిబంధనలు 
ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) పొందేందుకు డీలర్లు, సరఫరాదారులు పాటించాల్సిన నిబంధనల్లోనూ ప్రభుత్వం సవరణలు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తాజాగా జారీ చేశారు. సరఫరాదారులు  జీఎస్టీఆర్‌ ఫాం–1లో ఇన్‌వాయిస్‌ల వివరాలు పొందుపర్చాల్సి ఉండగా డీలర్లు జీఎస్టీఆర్‌–2బీలో వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది.

అప్పుడే ఐటీసీ వర్తించేందుకు అనుమతి లభిస్తుంది. అలాగే చెల్లించిన పన్నును రీఫండ్‌ కింద తిరిగి పొందాలంటే ఇన్‌వాయిస్‌లపై యునిక్‌ ఐడెంటిటీ నెంబర్‌ (యూఐఎన్‌)ను రాయాల్సి ఉంటుందని, లేదంటే డీలర్‌ ధ్రువీకరణను జతపర్చాల్సి ఉంటుందని నిబంధనలను సవరించింది. ప్రతి సంవత్సరం సమర్పించిన రిటర్న్‌లను డీలర్ల స్వీయ ధ్రువీకరణతో ఫిబ్రవరి 28లోపు సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.    

>
మరిన్ని వార్తలు