చేపలు వదిలారు... గొర్రెలెప్పుడో?

15 Sep, 2022 02:05 IST|Sakshi

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో గొర్రెల పంపిణీపై ప్రభుత్వ వర్గాల తర్జనభర్జన 

ఉప ఎన్నిక అనివార్యమని తేలిన మొదట్లో హడావుడి... ఆ తర్వాత అంతా గప్‌చుప్‌ 

నియోజకవర్గంలో 7,200 యూనిట్లకు డీడీలు కట్టిన లబ్ధిదారులు 

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమలుపై ప్రభుత్వ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సమయంలో ఆ నియోజకవర్గంలో హడావుడి చేసి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసిన పశుసంవర్థక శాఖ అధికారులు ఇప్పుడు గప్‌చుప్‌ కావడం చర్చనీయాంశమైంది.

రెండో విడత గొర్రెల పంపిణీ కోసం అక్కడ 7,200 యూనిట్ల గొర్రెల కోసం లబ్ధిదారులు ఇప్పటికే డీడీలు చెల్లించగా, వారికి గొర్రెలు ఎప్పుడివ్వాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. అసలు ఈసారి గొర్రెల పంపిణీ ఉంటుందా లేదా అన్నదానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని, తామైతే లబ్ధిదారుల వివరాలను సేకరించామని చెబుతున్నారు. గొర్రెల కొనుగోలుకు అవసరమైన రూ.90 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తుందో తేలాల్సి ఉంది.  

ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా..: రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడి లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో గొర్రెలు పంపిణీ చేశారు. అయితే, మునుగోడు విషయంలో ప్రభుత్వం భిన్నంగా ఆలోచిస్తోందనే చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనా మా వల్లనే సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో నియోజకవర్గ ప్రజలకు అందుతున్నాయనే చర్చకు తావులేకుండా ఆచితూ చి వ్యవహరిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఇంకా గొర్రెల పంపిణీపై నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే, బుధవా రం మునుగోడు మండలంలోని కిష్టాపూర్‌ పెద్ద చెరువులో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వ హించింది. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ ముదిరాజ్, గొర్రెల సమాఖ్య చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజుయాదవ్‌లు హాజరై అక్కడి చెరువులో చేపపిల్లలను వదిలారు.

అలాగే, గొర్రెలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గొర్రెల పంపిణీ త్వరలో జరుగుతుందా? ఈసారి ప్రభుత్వ వ్యూహం ఏంటి? రెండో విడతలో భాగంగా అందరితోపాటే ఈ నియోజకవర్గంలో గొర్రెల పంపిణీ ఉంటుందా? లేదా ఉప ఎన్నిక సమయంలోనే పంపిణీ జరుగుతుందా? అన్నది వేచిచూడాల్సిందే.   

మరిన్ని వార్తలు