కోటిమందికి బతుకమ్మ చీరలు.. నేతన్నల జీవితాల్లో వెలుగన్న కేటీఆర్‌

22 Sep, 2022 12:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ చీరలను రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ చీరల పంపిణీ జరిగేలా చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది సుమారు కోటి చీరల పంపిణీ లక్ష్యంగా నిర్దేశించుకున్న రాష్ట్రప్రభుత్వం ఈ చీరల తయారీకి రూ.339.73 కోట్లు వెచ్చించింది.

గతంతో పోలిస్తే ఈ ఏడాది 24 విభిన్న డిజైన్లు, ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల జరీ అంచులతో (త్రెడ్‌ బోర్డర్‌) తెలంగాణ టెక్స్‌టైల్‌ విభాగం ఈ చీరలను తయారు చేయించింది. గ్రామీణ ప్రాంతాల మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు, ఆసక్తిని పరిగణనలోకి తీసుకొని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) సహకారంతో డిజైన్లను రూపొందించారు. అత్యుత్తమ ప్రమాణాలతో చీరలను ఉత్పత్తి చేశారు. రెండు విభిన్న పొడవుల్లో చీరలను తయారు చేయించగా, ఇందులో ఆరు మీటర్ల చీరలు 92 లక్షలు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళలు ధరించే 9 మీటర్ల పొడవైన చీరలు ఎనిమిది లక్షలు తయారు చేయించినట్లు చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం వెల్లడించింది. రాష్ట్రంలో ఆహార భద్రత కార్డు కలిగి, 18 ఏళ్లు పైబడిన మహిళలకు అందజేయనున్నారు.

బతుకమ్మ చీరలతో నేతన్నల జీవితాల్లో వెలుగు: కేటీఆర్‌
తెలంగాణ ఆడపడుచులకు ప్రేమపూర్వక చిరుకానుక ఇచ్చేందుకు 2017లో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించినట్లు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. గురువారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. సంక్షోభంలో చిక్కుకున్న నేత కార్మికులకు బతుకమ్మ చీరల తయారీతో భరోసా వచ్చిందన్నారు. నేతన్నల వేతనాలు రెట్టింపు కావడంతో పాటు కార్మికులు తమ కాళ్లపై తాము నిలబడే పరిస్థితికి చేరుకున్నారని తెలిపారు. నేత కార్మికులు ఏడాది పొడవునా ఉపాధి పొందేందుకు ఈ పథకం దోహదం చేసిందన్నారు.

సమైక్య రాష్ట్రంలో దెబ్బతిన్న నేత కార్మికులను ఆదుకునేందుకు సొంత రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం వస్త్ర ఉత్పత్తులపై జీఎస్‌టీ వంటి విధానాలతో వారి ఉపాధిని క్లిష్టతరం చేస్తోందన్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు 5.81 కోట్ల చీరలను పంపిణీ చేసినట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి: టెర్రర్‌ ఫండింగ్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ తనిఖీలు

మరిన్ని వార్తలు