మనకూ బ్రాండ్‌ ఉండాలి.. సర్కార్‌ బ్రాండ్‌తో మార్కెటింగ్

27 Feb, 2021 01:42 IST|Sakshi

పండ్లు, కూరగాయలను సర్కార్‌ బ్రాండ్‌తో మార్కెటింగ్‌ చేయాలి  

వినియోగదారుల్లో నమ్మకం కోసం తప్పనిసరి 

ప్రభుత్వానికి ఆస్కీ సిఫారసు... నివేదిక అందజేత  

ఉద్యానశాఖకు రూ.1,700 కోట్లు కేటాయించాలి 

కూరగాయలు, పండ్ల కొరత తీర్చేందుకు క్లస్టర్లు ఏర్పాటు చేయాలి

సాక్షి, హైదరాబాద్‌: మార్కెట్లో ప్రైవేట్‌ రంగం నుంచి వస్తున్న కూరగాయలు, పండ్లు, సుగంధద్రవ్యాలు వంటి ఉత్పత్తులపై వినియోగదారుల్లో ఎన్నో సందేహాలు ఉంటున్నాయని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ) అభిప్రాయపడింది. అందుకే ప్రభుత్వమే ఒక బ్రాండ్‌ను నెలకొల్పి ఉద్యాన ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేస్తే, ఒకవైపు వినియోగదారులకు ప్రయోజనం కలగడంతో పాటు రైతులకూ లాభాలు వస్తాయని సిఫారసు చేసింది. తెలంగాణలో ఉద్యాన పంటల సాగు, ఉత్పత్తి, అవసరాలపై ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వం ఆస్కీని అధ్యయనం చేయమని కోరింది. ఈ నేపథ్యంలో ఆస్కీ పలు సిఫారసులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై ప్రభుత్వం పలు దఫాలుగా చర్చించింది. ముఖ్యమంత్రికి కూడా ఈ నివేదికను అందజేసినట్లు ఉద్యానశాఖ వర్గాలు తెలిపాయి. ఉద్యానశాఖ అధికారులు కేవలం ఆఫీసులకే పరిమితం అవుతున్నారని, క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లి ఏ పంట.. ఎలా పండిస్తే ఏ మేరకు లాభం ఉంటుందో వివరించి చెప్పాలని సూచించింది.  

అదనంగా 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు 
రాష్ట్ర అవసరాలకు సరిపడా కూరగాయలు, పండ్లు పండాలంటే సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరగాలని ఆస్కీ స్పష్టం చేసింది. అందుకోసం వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో అదనంగా రెండు లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును పెంచాలని సిఫార్సు చేసింది. దీంతో ఉద్యాన ఉత్పత్తుల విలువ దాదాపు రూ. 40 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గి, ఎగుమతులు కూడా పెరుగుతాయని తెలిపింది. ఉద్యాన ఉత్పత్తులను పెంచాలంటే, ఉద్యాన శాఖకు ప్రతీ ఏటా బడ్జెట్లో రూ. 1,700 కోట్లు కేటాయించాలని సూచించింది. అలాగే ఉద్యానశాఖలో అధికారులు, ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెంచాలని, అందుకోసం నియామకాలు చేపట్టాలని సిఫారసు చేసింది.  

క్రాప్‌ క్లస్టర్ల ఏర్పాటు 
రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల లోటు భారీగా ఉందని, వాటి కొరత తీరాలంటే క్రాప్‌ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ‘పండ్ల సాగుకు ఐదు క్లస్టర్లు, కూరగాయలకు తొమ్మిది, పూలకు ఒకటి, సుగంధ ద్రవ్యాలకు ఐదు క్లస్టర్లు ఉండేలా ప్రణాళిక రచించాలి. అందుకోసం ప్రతి జిల్లాలో అక్కడి వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావం, నీటి వసతిని పరిశీలించాలి. రైతులు తమ పంటల పొలాల గెట్ల వద్ద టేకుతో పాటు చింత, జామ, వెదురు తదితరమైనవి వేసుకునేలా అవగాహన కల్పించా’లని తెలిపింది. అక్టోబర్‌ నెలలో ఉల్లిగడ్డ దిగుమతులు రాష్ట్రానికి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఫలితంగా ధరలు తగ్గి, రైతులకు నష్టం వస్తోంది. అందుకే అక్టోబర్‌లో ఉల్లిగడ్డ దిగుమతులు తగ్గించాలని సూచించింది. ఆలుగడ్డ పండిస్తే రైతులకు గిట్టుబాటు అవుతుందని, దాన్ని 27 వేల ఎకరాల్లో సాగు చేసేలా చూడాలంది. 16 నుంచి 25 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉండే సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో పండించాలని పేర్కొంది. 

మరికొన్ని సిఫారసులు 
►ఖరీఫ్, రబీలలో కొన్ని రకాల కూరగాయలు అదనంగా వస్తున్నాయి. వాటికి డిమాండ్‌ వచ్చేలా ప్రణాళిక రచించాలి.  
►వేసవిలో వస్తున్న కొరతను అధిగమించేలా ఉత్పత్తి, సరఫరా పెంచాలి. 
►ఉద్యాన ఉత్పత్తులకు కోల్డ్‌చైన్లు ముఖ్యం. ప్రీ కూలింగ్, కోల్డ్‌ స్టోరేజ్‌లు, రైసెనింగ్‌ చాంబర్లు (పండ్లను మగ్గబెట్టేందుకు) ఏర్పాటు చేయాలి.  
►5 వేల మెట్రిక్‌ టన్నులతో 30 కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు, 300 రైసెనింగ్‌ చాంబర్లు, ప్రతి కూరగాయల మార్కెట్‌కు ఒక రిఫ్రిజిరేటర్‌ ఉండాలి. 
►రెడీ టు సర్వ్‌లో భాగంగా డ్రైయింగ్, ఓస్మోటిక్‌ డీ హైడ్రేషన్, పల్పింగ్‌ జ్యూస్‌ చేసే ప్రాసెసింగ్‌ సౌకర్యాలు కల్పించాలి. 
►మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు