ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు 31 వరకు పొడిగింపు

16 Oct, 2020 01:23 IST|Sakshi

ప్రజా విజ్ఞప్తుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

ఇప్పటివరకు 19.33 లక్షల దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల గడువును అక్టోబర్‌ 31 వరకు పొడిగించినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరా, ఇంటర్నెట్‌కు అంతరాయం కలగడంతో చాలా మంది దరఖాస్తు చేసుకోలేక పోయారని, ఈ నేపథ్యంలో గడువు పొడిగిం చాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌.. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లితో సమీక్షించి దరఖాస్తుల గడువు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఎల్‌ఆర్‌ ఎస్‌కు సంబంధించి గురువారం రాత్రి 9 గంటల వరకు 19.33 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు.

ఇందులో చివరి రోజే గురువారం 2.53 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అక్రమ, అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను తప్పనిసరి చేస్తూ ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. క్రమబద్ధీకరణ చేయించుకోకుంటే, సదరు అక్రమ ప్లాట్ల తదుపరి క్రయవిక్రయాలకు రిజిస్ట్రేషన్‌ జరపబోమని, ఇళ్ల నిర్మాణ అనుమతులు సైతం జారీ చేయబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో 45 రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 19.33 లక్షల దరఖాస్తులు రాగా, గురువారం అర్ధరాత్రికి ఈ సంఖ్య 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, గడువు పొడిగింపు ఉత్తర్వులు శుక్రవారం వెలువడే అవకాశం ఉంది. (చదవండి: కానిస్టేబుళ్లకు కమిషనర్‌ సెల్యూట్‌!)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు