గోపాలమిత్రలకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక: మంత్రి తలసాని

5 Oct, 2022 10:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పశుసంవర్థక శాఖ పరిధిలో పనిచేస్తున్న గోపాలమిత్రలకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న నెలవారీ వేతనానికి అదనంగా 30 శాతం పెంచుతున్నట్టు వెల్లడించింది. గోపాలమిత్రలకు రాష్ట్ర ‍ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల తరహాలోనే 30 శాతం వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీచేశామని, ప్రస్తుతం నెలకు వస్తున్న రూ.8,500కు తోడు పెంచిన 30 శాతం (రూ.2550) కలిపి రూ.11,050 చెల్లిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మంగళవారం తెలిపారు. 

గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగానికి అందుబాటులో ఉంటూ పాడిగేదెలకు కృత్రిమ గర్భధారణ, వ్యాక్సినేషన్‌, నట్టల నివారణ మందుల పంపిణీ లాంటి కార్యక్రమాల అమలులో సేవలందిస్తున్న గోపాల మిత్రలను ప్రభుత్వ గుర్తించి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తెలంగాణలో గోపాలమిత్రలకు ఇస్తున్న వేతనాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తాజా పెంపుతో 1,530 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు.
(చదవండి: ఉపఎన్నికలో ఓ గ్రామ ఇన్‌చార్జిగా కేసీఆర్‌.. ఏ గ్రామానికి అంటే?)

మరిన్ని వార్తలు