ప్రభుత్వ వైద్యం.. పల్లెల దైన్యం

8 May, 2022 01:13 IST|Sakshi

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్తెసరు వైద్య సేవలు 

ఉండాల్సిన పీహెచ్‌సీలు 721.. ఉన్నవి 636 

180 సీహెచ్‌సీలకు 85 మాత్రమే అందుబాటులో 

అనేక ప్రభుత్వాస్పత్రుల్లో వేధిస్తున్న సిబ్బంది కొరత 

‘గ్రామీణ ఆరోగ్య గణాంకాలు 2020–21’ విడుదల చేసిన కేంద్రం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతా ల్లో ప్రభుత్వ వైద్యం అంతంతే అందుతోంది. జనాభా పెరుగుతున్నా ఆ మేరకు వైద్య సేవలు విస్తృతం కావట్లేదు. పల్లెల్లో అనుకున్నంత సంఖ్యలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) అందుబాటులో లేవు. ఈ వివరాలన్నింటినీ కేంద్ర ఆరో గ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన దేశంలో ‘గ్రామీణ వైద్య గణాంకాలు 2020– 21’లో వెల్లడించింది. ఇందులో రాష్ట్రాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవల తీరును ప్రస్తావించింది.  

పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు పెరగాలి  
గ్రామీణ జనాభాకు అనుగుణంగా రాష్ట్రంలో 721 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అవసరం ఉండగా  ప్రస్తుతం 636 మాత్రమే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సామాజిక ఆరోగ్య కేంద్రాలు 180 అవసరం ఉండగా 85 మాత్రమే కొనసాగుతున్నాయంది. పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంజూరు చేసిన పోస్టుల కంటే పనిచేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉందని చెప్పింది.

సిబ్బంది సంఖ్య కూడా మరింత పెరగాలని, గ్రామీణ వైద్య సేవలు  మెరుగు పడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో 33 జిల్లాలున్నాయి. వీటి పరిధిలో 5 వేల ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. ఇవి 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కొనసాగుతున్నాయి. వీటితో పాటు 95  సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 37 సబ్‌ డివిజినల్‌ ఆస్పత్రులు, 5 జిల్లా ఆస్పత్రులున్నాయి. 

గ్రామీణ ఆస్పత్రుల పరిస్థితి ఇలా..
♦రాష్ట్రంలోని 5 జిల్లా ఆస్పత్రుల్లో 319 వైద్యుల పోస్టులు ప్రభుత్వం మంజూరు చేయగా 266 మంది డాక్టర్లే పని చేస్తున్నారు. సబ్‌ డివిజినల్‌ ఆస్పత్రుల్లో 1,421 వైద్యుల పోస్టులకు 681 మందే విధుల్లో ఉన్నారు. 85 గ్రామీణ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో జనరల్‌ సర్జన్లు, గైనకాలజిస్టులు, జనరల్‌ ఫిజీషియన్లు, పీడియాట్రీషియన్లు కలుపుకొని మొత్తం 625 స్పెషలిస్టు పోస్టులు మంజూరవగా 367 ఖాళీగా ఉన్నాయి. వీటిలో 53 మంది జనరల్‌ సర్జన్లు, 141 మంది గైనకాలజిస్టులు, 49 మంది జనరల్‌ ఫిజీషియన్లు, 124 మంది పిల్లల వైద్యుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. సీహెచ్‌సీల్లో 219 అనస్థటిస్ట్‌ పోస్టులకు 126.. అలాగే 44 కంటి వైద్యుల పోస్టులకు 19 భర్తీ కాలేదు.  

♦సీహెచ్‌సీల్లో జనరల్‌ డ్యూటీ వైద్యులకు సంబంధించి ఆయుష్‌ కేటగిరీలో 29 ఖాళీలు, అల్లోపతిలో 122 ఖాళీలు భర్తీ కావాల్సి ఉంది. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కనీసం ఒక్కొక్కరు చొప్పున స్పెషలిస్టు ఆయుష్‌ వైద్యులను నియమించాల్సి ఉండగా ఒక్క పోస్టు కూడా మంజూరు చేయలేదు. 

♦ఆరోగ్య ఉప కేంద్రాలకు 8,996 ఏఎ¯న్‌ఎం పోస్టులు మంజూరు చేస్తే 1,053 ఖాళీగా ఉన్నాయి.  పురుషుల కేటగిరీలో 1,911 ఆరోగ్య కార్యకర్తల పోస్టులను 689 నింపాల్సిఉంది.  

♦పీహెచ్‌సీల్లో 1,254 మంది అల్లోపతి వైద్య పోస్టులకు 41 ఖాళీగా ఉన్నాయి. ఆయుష్‌ వైద్యుల పోస్టులు 394 మంజూరవగా 151 భర్తీ కాలేదు. 

♦పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు 2,412 నర్సుల పో స్టులు మంజూరవగా 336 ఖాళీగా ఉన్నాయి. జిల్లా ఆస్పత్రుల్లో పారామెడికల్‌ పోస్టులు 869 మంజూరవగా 708 మాత్రమే భర్తీ చేశారు. ప్రాంతీయ ఆస్పత్రుల్లో 1,217 పోస్టులకు 979 మాత్రమే భర్తీ అయ్యాయి. 

మరిన్ని వార్తలు