స్మార్ట్‌కార్డులు సిద్ధం!

24 Aug, 2021 02:06 IST|Sakshi

దళితబంధు లబ్ధిదారులకు 28 నాటికి పంపిణీ 

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తున్న ప్రభుత్వం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు కార్యక్రమంలో కీలక అడుగుపడింది. పథకం అమలుకు దిక్సూచిలా భావిం చేస్మార్ట్‌కార్డులు సిద్ధమవుతున్నాయి. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్మార్ట్‌కార్డులు అందజేస్తానని ఇప్పటికే ప్రకటించింది. వాస్తవానికి వీటిని ఈనెల 17వ తేదీన లబ్ధిదారులకు అందజేయాల్సి ఉన్నప్పటికీ, కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలన్న యోచనతో ఆలస్యంగా జరిగింది. 24వ తేదీ వరకు గడు వు అనుకున్నా.. ఇంకా స్పష్టత రాకపోవడం తో 28వ తేదీ వరకు కార్డులను పంపిణీ చే యాలని లక్ష్యంగా పెట్టుకుంది. దళితబంధు అమలు కోసం ప్రత్యేక వెబ్‌సైట్, సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

ఇందు కోసం ప్రత్యేకమైన బయోమెట్రిక్‌ కార్డులు కూడా సిద్ధమవుతున్నాయి. ఇందులో సెల్‌ఫోన్‌ సిమ్‌ కార్డు తరహాలో ఉన్న ప్రత్యేకమైన చిప్‌లో దళితబంధు లబ్ధిదారుల సమాచారం ఉంటుంది. లబ్ధిదారునితోపాటు అతని భార్యాపిల్లలు, ఎంచుకున్న ఉపాధి/వ్యాపారం/యూనిట్‌ వివరాలు, వాటికి అయిన ఖర్చు, బ్యాంక్‌ బ్యాలెన్సు, రోజువారీ లావాదేవీలు, పొదు పు, నిర్వహణ, బీమా/నామినీ ఇలా మొత్తం అతను ఎంచుకున్న వ్యాపారానికి సంబంధించిన సమస్త సమాచారం పొందుపరిచి ఉం టుంది. ఒక్కమాటలో చెప్పాలంటే లబ్ధిదారులకు ఇది ఆధార్‌కార్డుతో సమానం. ఈ కార్డు ల ద్వారా ప్రతి లబ్ధిదారుని ఖాతాలో రూ.10 లక్షలు జమ అయిన దగ్గర నుంచి వాటిని ఖర్చు చేస్తున్న తీరు, బిల్లుల చెల్లింపు, లాభనష్టాలు అన్నింటినీ అధికారులు పర్యవేక్షిస్తారు. వారి వ్యాపారస్థితిని బట్టి అప్రమత్తం చేస్తుంటారు. 

ప్రత్యేక యాప్‌లో వివరాలు.. 
త్వరలోనే దళితబంధు యాప్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో లబ్ధిదారులకు కావాల్సిన సమాచారం. అధికారుల ఫోన్‌నెంబర్లు, వ్యాపారం వివరాలు, తోటి వ్యాపారుల పురోగతి, మార్కెట్‌ ట్రెండ్స్, వివిధ వ్యాపారాల సమాచారం తదితర కీలకమైన విషయాలు అందుబాటులో ఉంచుతారు. దీనికితోడుగా దళితబంధుకు ప్రత్యేక పోర్టల్‌ కూడా వేగంగా రూపుదిద్దుకుంటోంది. కాగా, దేశంలోనే ఇంతటి భారీ ఆర్థిక ప్యాకేజీతో రూపొందించిన పథకం కావడంతో దీని అధ్యయనానికి వివిధ పరిశోధక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ నుంచి పలువురు హుజూరాబాద్‌ను సందర్శించారు. పలు స్వచ్ఛంద సంస్థలు, పరిశోధక సంస్థలు కూడా ఈ పథకం అమలు అధ్యయనంపై ఆసక్తి చూపిస్తున్నాయి.   

మరిన్ని వార్తలు