Telangana: ఎల్‌ఆర్‌ఎస్‌కు ఓకే.. కీలక మార్గదర్శకాలు జారీ

21 Jul, 2021 02:19 IST|Sakshi

దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ

రెండు దశల్లో దరఖాస్తుల పరిష్కారం 

తొలుత గ్రామం/ సర్వే నంబర్‌ వారీగా క్లస్టరింగ్‌  

తర్వాత క్షేత్ర స్థాయిలో సైట్‌ ఇన్‌స్పెక్షన్‌  

15 రోజుల్లో రెండు ప్రక్రియలు పూర్తికి పురపాలక శాఖ ఆదేశం  

ఆ తర్వాత తదుపరి మార్గదర్శకాలు

మొత్తం 25 లక్షల దరఖాస్తులకు లభించనున్న మోక్షం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు దారుల నిరీక్షణ త్వరలో ఫలించనుంది. లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌)–2020 కింద వచ్చిన దరఖాస్తులకు మోక్షం కల్పించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది.  

రెండు దశలు ఇలా.. 
తొలి దశలో గ్రామపంచాయతీ/ మున్సిపాలిటీ/ మున్సిపల్‌ కార్పొరేషన్ల నుంచి వచ్చిన దరఖాస్తులను... గ్రామం/ సర్వే నంబర్‌ /ప్రాంతం / కాలనీల వారీగా వేర్వేరు క్లస్టర్లుగా విభజించి,  స్థల పరిశీలన కోసం సిద్ధంగా ఉంచాలని సూచించారు. రెండో దశలో.. రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, స్థానిక టౌన్‌ ప్లానింగ్‌ శాఖల అధికారులు/ డీటీసీపీఓలతో జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేసిన బృందాలు ప్రతి క్లస్టర్‌ను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. తనిఖీల సందర్భంగా పరిశీలించిన అంశాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఈ బృందాలను కోరారు. ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనల ప్రకారం దరఖాస్తు ఉందా ? లేదా ? అని పరిశీలించి ఇదే అంశాన్ని జిల్లా కలెక్టర్, స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌కు నివేదించాలని సూచించారు. ఈ మేరకు తక్షణమే బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. 15 రోజుల్లోగా ఈ ప్రక్రియలను పూర్తి చేసి ఎల్‌ఆర్‌ఎల్‌ దరఖాస్తుల పురోగతి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్లు సమర్పిస్తే, తదుపరి మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

చెక్‌ లిస్ట్‌ మేరకు నిర్ణయం తీసుకోవాలి 
దరఖాస్తులు ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా ? లేదా ? అన్న అంశాన్ని గుర్తించడానికి పురపాలక శాఖ చెక్‌ లిస్ట్‌ రూపొందించి విడుదల చేసింది. లేఅవుట్, ప్లాట్‌ తనిఖీకి వెళ్ళినప్పుడు అధికారుల బృందం ఈ చెక్‌ లిస్ట్‌ ఆధారంగా పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సైట్‌ ఇన్‌స్పెక్షన్‌ ముగిసిన తర్వాత ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న/ క్రమబద్ధీకరణకు అర్హత లేని దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించనుంది. క్రమబద్ధీకరణకు అర్హత గల దరఖాస్తుల పరిష్కారానికి పురపాలక శాఖ మళ్ళీ కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది. అర్హత గల దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన అదనపు సమాచారాన్ని, సంబంధిత శాఖల నుంచి కావాల్సిన ఎన్‌ఓసీలు సమర్పించడానికి దరఖాస్తుదారులకు నెల రోజులు గడువు ఇచ్చే అవకాశం ఉంది. అన్ని రకాలుగా అర్హమైన దరఖాస్తుల విషయంలో చెల్లించాల్సిన క్రమబద్ధీకరణ ఫీజులను దరఖాస్తుదారులకు ఆన్‌లైన్‌ ద్వారా నోటిఫై చేయడంతో పాటు చెల్లింపునకు తగినంత సమయం కూడా ప్రభుత్వం ఇవ్వనుందని అధికారవర్గాలు తెలిపాయి.   

మొత్తం 25 లక్షల దరఖాస్తులు.. 
రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు గతేడాది ఆగస్టులో ఎల్‌ఆర్‌ఎస్‌–2020 పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా, రికార్డు స్థాయిలో  25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తాజాగా ఈ దరఖాస్తుల పరిష్కారానికి పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దరఖాస్తుల క్లస్టరింగ్‌ (గ్రూపులుగా విభజించడం), సైట్‌ ఇన్‌స్పెక్షన్‌ (స్థల తనిఖీ) అనే రెండు ప్రక్రియలను వచ్చే 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు (మెమో) జారీ చేశారు.   

మరిన్ని వార్తలు