111 జీవో ఎత్తివేత.. ఆంక్షలు తొలగిస్తూ జీవో నంబర్‌ 69 జారీ

21 Apr, 2022 04:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/రంగారెడ్డి జిల్లా:  రాష్ట్ర రాజధానికి తాగునీటిని అందించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జలాశయాల పరిరక్షణ కోసం గతంలో జారీ చేసిన 111 జీవోను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రిజర్వాయర్ల ద్వారా నగరానికి సరఫరా అయ్యే తాగునీరు అతి తక్కువ అని, ఇకపై వాటిపై ఆధార పడాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయినా జలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ బుధవారం జీవో నంబర్‌ 69 జారీ చేశారు. ఈ జలాశయాల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 

అప్పట్లో పరిరక్షణ కోసం..
హైదరాబాద్‌ నగరాన్ని మూసీ వరదల నుంచి రక్షించేందుకు, అదే సమయంలో తాగునీటిని అం దించేలా నిజాం హయంలోనే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జలాశయాలను నిర్మించారు. అప్పటి నుంచీ హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరులుగా ఉన్న ఈ రిజర్వాయర్ల పరిరక్షణ కోసం 1996లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 111ను జారీ చేసింది. జలాశయాలకు చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల పరిధిలో ఉన్న 1,32,000 ఎకరాల విస్తీర్ణంలో.. పరిశ్రమలు, హో టళ్లు, వాణిజ్య సముదాయాలు, నివాసాలు, నిర్మా ణాలపై నియంత్రణలు విధించింది. కొన్నేళ్లుగా నగరం విపరీతంగా విస్తరించడం, తాగునీటి కోసం కృష్ణా, గోదావరి జలాలను తరలించడం నేపథ్యంలో.. 111 జీవో ఎత్తివేయాలన్న డిమాండ్‌ మొదలైంది. ఈ జీవోను సమీక్షిస్తామని టీఆర్‌ఎస్‌ సర్కారు కూడా పలుమార్లు ప్రకటించింది. తాజా గా జీవో ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

సీఎస్‌ ఆధ్వర్యంలో కమిటీ.. 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో.. మున్సిపల్, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, వాటర్‌ బోర్డు ఎండీ, కాలుష్య నియంత్రణ బోర్డు మెంబర్‌ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌ (ప్లానింగ్‌) సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఏయే అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న దానిపై విధివిధానాలనూ ప్రభుత్వం ఖరారు చేసింది. రెండు రిజర్వాయర్ల పరిరక్షణ, కాలుష్య నివారణకు అవసరమైన చర్యలను సూచించాలని.. ప్రధాన మౌలిక సదుపాయాల కల్పనకు విధానాలు రూపొందించాలని ఆదేశించింది. మురుగు, వరద కాల్వల నిర్మాణం, అవసరమైన నిధుల సమీకరణ, లేఅవుట్లు, భవన నిర్మాణాల అనుమతికి విధించాల్సిన నియంత్రణలు, న్యాయపరమైన అంశాలను పరిశీలించాలని పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించింది. 

84 గ్రామాలకు విముక్తి: సబిత
111 జీవో ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంపై సీఎం కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి సబిత ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఇటీవల కేబినెట్‌లో తీర్మానం చేసి, 69 జీవో విడుదల చేయటంతో 84 గ్రామాల ప్రజలకు శాశ్వత విముక్తి లభించిందన్నారు. జంట జలాశయాలు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేయటం శుభ పరిణామమన్నారు.   

111 జీవో ఎత్తివేస్తామని గత నెల 15న సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించడంతోనే ఈ ప్రాంతాల్లో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వం నుంచి స్పష్టత రావడంతో కొనుగోలుదారులు, రియల్టర్లు భూములు కొనేందుకు ఎగబడ్డారు. మరోవైపు ఇప్పటికే సంపన్న వర్గాలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు జీవో 111 ప్రాంతాల్లో తక్కువ ధరకే భారీగా భూములు కొనుగోలు చేసి.. ఫామ్‌హౌజ్‌లు, రిసార్టులుగా మార్చుకున్నారు. వేల ఎకరాలు వారి చేతుల్లోనే ఉన్నట్టు అంచనా. అనధికారిక లేఅవుట్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఇప్పడు వీటి ధరలు చుక్కలను తాకనున్నాయి. మరోవైపు ఇప్పటివరకు కోట్లు పలికిన గచ్చిబౌలి, కొండాపూర్, కోకాపేట, నార్సింగి తదితర ప్రాంతాల్లో భూముల ధరల్లో కొంతకాలం స్తబ్దత నెలకొనే అవకాశం ఉందని రియల్‌ఎస్టేట్‌ వర్గాలు చెప్తున్నాయి. 

1.32 లక్షల ఎకరాలు రెడీ...
గ్రేటర్‌ హైదరాబాద్‌ విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లుకాగా.. 111 జీవో పరిధిలోని భూమి విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు కావడం గమనార్హం. జీవో 111 కింద 84 గ్రామాల్లోని 1,32,600 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 32 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. ఆంక్షల ఎత్తివేతతో ఈ భూములన్నీ అందుబాటులోకి రానున్నాయి.  

27 ఏళ్లుగా పోరాటాలు 
తమ అభివృద్ధి అడ్డంకి మారిందని, హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్నా భూములకు ధరలేకుండా పోయిందంటూ 111 జీవో పరిధిలోని గ్రామాల ప్రజలు 27 ఏళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. జీవోను రద్దు చేయాలంటూ అన్ని గ్రామాల సర్పంచులు రెండుసార్లు మూకుమ్మడిగా తీర్మానాలు చేసి పంపారు. ఇన్నేళ్ల తర్వాత గండిపేట, శంకర్‌పల్లి, శంషాబాద్, మొయినాబాద్, చేవెళ్ల, కొత్తూరు మండలాల ప్రజలకు ఊరట కలిగింది. 

భారీగా కంపెనీలు, నిర్మాణాలు..
జీవో ఎత్తివేత ద్వారా నిర్మాణాలపై ఆంక్షలు తొలగిపోవడంతో ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఐటీ హబ్‌గా అవతరించిన గచ్చిబౌలికి ఈ ప్రాంతాలు చేరువలో ఉండటంతో ఐటీ కంపెనీల స్థాపనకు అవకాశం ఏర్పడనుంది. ఈ ప్రాంతాలకు బహుళ అంతస్తుల నిర్మాణాలు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు వస్తాయని.. భూముల ధరలు, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని అంటున్నారు. 

కోర్టును ఆశ్రయిస్తాం
జంట జలాశయాల ఎగువన విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, రిసార్ట్స్, పబ్స్, బార్లు, బహుళ అంతస్తుల భవంతులు, హోటళ్లు, పరిశ్రమలు ఏర్పాటైతే జలాశయాలు కాలుష్యకాసారంగా మారుతాయి. మరో మూసీలా మారే ప్రమాదం పొంచి ఉంది. జీవో 111 తొలగింపులో అనేక న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయి. ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తాం. 
– సజ్జల జీవానందరెడ్డి, లుబ్నా సార్వత్‌  పర్యావరణవేత్తలు  

మరిన్ని వార్తలు