తెలంగాణలో మొత్తం ఖాళీ పోస్టులు 56,979

15 Jul, 2021 02:35 IST|Sakshi

కేబినెట్‌కు నివేదించిన ఆర్థిక శాఖ

పలు ప్రభుత్వ శాఖల్లో 44,022S ఖాళీలు.. ఇతర సంస్థల్లో 12,957 ఖాళీల భర్తీకి అవకాశం

పోలీసుశాఖలో 21,507 పోస్టులు

సమాచార శాఖలో 4 మాత్రమే

దాదాపు 18 వేల ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీల ప్రస్తావన మాత్రం లేదు

మొత్తం 28 శాఖల వివరాలు మంత్రివర్గం ముందుకు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి అవకాశముందో ఆర్థిక శాఖ తేల్చింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 44,022, ఆయా శాఖల పరిధిలోని గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, ఇతర సంస్థల్లో 12,957 కలిపి మొత్తం 56,979 డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ (డీఆర్‌) పోస్టుల భర్తీకి అవకాశముందని స్పష్టం చేసింది. ఈ మేరకు నివేదికను బుధవారం కేబినెట్‌కు సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం పోలీసు శాఖలో ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉండగా, అతి తక్కువగా సమాచార శాఖలో కేవలం నాలుగంటే నాలుగు పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. ఇలా మొత్తం 28 శాఖల వివరాలను కేబినెట్‌కు సమర్పించగా, 8 ప్రభుత్వ శాఖల్లో 100కన్నా తక్కువ ఉద్యోగ ఖాళీలు చూపెట్టారు. సంక్షేమ గురుకులాల్లో పోస్టుల సంఖ్యను చూపెట్టినా, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు
18 వేల పోస్టులను మాత్రం నివేదికలో ప్రస్తావించలేదు.

కానిస్టేబుళ్ల పోస్టులు 19,251
పోలీసు శాఖలో 21,507 డీఆర్‌ పోస్టులు నింపేందుకు అవకాశముందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఇందులో 88 డీఎస్పీ (సివిల్‌), 368 ఎస్‌ఐ (సివిల్‌), 19,251 కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీకి అవకాశం ఉందని తెలిపింది. అలాగే 515 ఫైర్‌మెన్, 380 ఎస్పీఎఫ్‌ కానిస్టేబుళ్లు, 174 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించింది.

సంక్షేమ గురుకులాల్లో..
సంక్షేమ గురుకులాల్లో 7,701 పోస్టుల భర్తీకి అవకాశముందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఇందులో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల సొసైటీ పరిధిలో 3,400, ఎస్సీ గరుకుల సొసైటీలో 1,784, ఎస్టీ గురుకులాల్లో 1,124, మైనార్టీ గురుకులాల్లో 1,393 పోస్టులు చూపెట్టారు.

పలు శాఖల్లో ఇలా...
వైద్య శాఖ విషయానికి వస్తే 3,353 స్టాఫ్‌ నర్సులు, 1,216 ఏఎన్‌ఎంలు, 1,085 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి అవకాశముంది. ఉన్నత విద్యలో 1,062 డిగ్రీ లెక్చరర్లు, 900 వరకు జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులున్నాయని ఆర్థిక శాఖ తేల్చింది. రెవెన్యూ శాఖ విషయానికి వస్తే 305 ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లు, 59 ఏసీటీవోలు, 48 సీటీవోలు, 169 జూనియర్‌ అసిస్టెంట్లు (పన్నుల శాఖ), 210 మంది డిప్యూటీ సర్వేయర్లు, 50 డ్రాఫ్ట్‌మెన్, 42 డిప్యూటీ కలెక్టర్లు, 95 నాయబ్‌ తహశీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో 894 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు, 121 ఎంపీడీవోలు, 195 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల భర్తీకి అవకాశముంది. నీటì పారుదల శాఖలో 721 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, 221 జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్లు, 184 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు, అటవీశాఖలో 856 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉండగా, మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు గ్రేడ్‌–1 కింద 181, గ్రేడ్‌–2 కింద 433 ఖాళీలున్నాయి. వ్యవసాయశాఖలో వ్యవసాయ విస్తరణాధికారులు 200, పశువైద్య విభాగంలో 244 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్లు, 103 వెటర్నరీ అసిస్టెంట్‌లు, రవాణా శాఖలో 108 మంది అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు పోస్టుల భర్తీకి అవకాశముందని ఆర్థిక శాఖ వెల్లడించింది.

మరిన్ని వార్తలు