TS: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. అక్కడినుంచి చదవాల్సిందే.. 

16 Mar, 2022 09:15 IST|Sakshi

 ఆరు నుంచి పదో తరగతి పాఠ్య పుస్తకాల్ని అధ్యయనం చేయవలసిందే 

షార్ట్‌కట్‌ మెథడ్స్‌ అంటూ ఏమీ లేవు

ప్రతి అంశమూ కీలకమేనని భావించాలి

సమకాలీన అంశాలపై అవగాహన అవసరం

పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు

సలహాలు, సూచనలు అందించిన నిపుణులు 

సాక్షి, హైదరాబాద్‌: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ప్రభుత్వం తీపి కబురు అందించడంతో వారిలో ఆశలు చిగురించాయి. ఉద్యోగాల భర్తీకి సర్కారు చేసిన ప్రకటన అభ్యర్థులకు ఉత్సాహాన్నిచ్చింది. దీంతో గ్రేటర్‌  హైదరాబాద్‌  మరోసారి పోటీపరీక్షల అధ్యయన కేంద్రంగా మారింది. ఏళ్లకేళ్లుగా  ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఊళ్లకు వెళ్లిన లక్షలాది మంది తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. కోచింగ్‌ సెంటర్‌లు, స్టడీహాళ్లు, పుస్తకాల దుకాణాలు కళకళలాడుతున్నాయి. నగరంలోని చిక్కడపల్లి, అశోక్‌నగర్, గాంధీనగర్, అమీర్‌పేట్‌ తదితర ప్రాంతాలు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులతో సందడిగా మారాయి. 

మరోవైపు సుమారు 18 వేల పోలీసుల ఉద్యోగాల కోసం పోలీసుశాఖ ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది. కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల శిక్షణకు దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్‌లలోని కోచింగ్‌ సెంటర్‌లకు అభ్యర్థుల తాకిడి పెరిగింది. పోలీసు, గ్రూప్‌–1 మొదలుకొని  గ్రూప్‌–4 వరకు వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వాళ్లు శాస్త్రీయమైన పద్ధతిలో అధ్యయనం చేయాలని, ఏ పోటీ పరీక్షకైనా ఎలాంటి షార్ట్‌కట్‌ మెథడ్స్‌ ఉండబోవని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.  
చదవండి: ఉద్యోగ నియామకాలకు రెడీ.. సర్కారు అనుమతులివ్వగానే ..


 
ఏ సెంటర్‌కు వెళ్తున్నారు... 
ఉద్యోగాల భర్తీపైన ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడిన వెంటనే  కోచింగ్‌ సెంటర్లు తలుపులు బార్లా తెరిచాయి. మరోవైపు ఆన్‌లైన్‌  శిక్షణ సంస్థలు, యూట్యూబ్‌ కోచింగ్‌లు సైతం ముందుకొచ్చాయి. గ్రేటర్‌లో చిన్నవి, పెద్దవి కలిసి సుమారు 150కి పైగా కోచింగ్‌ సెంటర్‌లు ఉన్నట్లు అంచనా. బాగా పేరున్న సంస్థల్లో  గ్రూప్‌–1కు రూ.70 వేలు.. గ్రూప్‌ –4కు రూ.25 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎస్సై, కానిస్టైబుల్‌  ఉద్యోగాలకు సైతం ఇదే స్థాయిలో డిమాండ్‌ ఉంది. 

ప్రభుత్వం భర్తీ చేయనున్న 80 వేల ఉద్యోగాల కోసం సుమారు 10 లక్షల మందికి పైగా పోటీ పడనున్నట్లు అంచనా. అభ్యర్థులు కోచింగ్‌ సెంటర్‌లను ఎంపిక చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యమైన అంశమని  నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలికంగా కోచింగ్‌ నిర్వహిస్తున్న అనుభవం, ఆయా సెంటర్‌లలో గతంలో ఎలాంటి ఫలితాలు వెలువడ్డాయనే అంశాల ఆధారంగా ఈ ఎంపిక ఉండాలి.  
చదవండి: CM KCR: తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ: సీఎం కేసీఆర్‌ ప్రకటన

అక్కడినుంచి చదవాల్సిందే.. 
సాధారణంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత మాత్రమే సీరియస్‌గా చదవడం  మొదలెడతారు. దీంతో అప్పటికప్పుడు మార్కెట్‌లో  లభించే గైడ్లు, ఇతర స్టడీ మెటీరియల్‌ పైన  ఆధారపడుతారు. ప్రామాణికమైన కోచింగ్‌ కేంద్రాల నుంచి  లభించే మెటీరియల్‌  మంచిదే. కానీ గ్రూప్‌ –1 నుంచి  గ్రూపు–4 వరకు అన్ని పోటీపరీక్షలకు సొంతంగా మెటీరియల్‌  రూపొందించుకోవడం మరింత  ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరు నుంచి పదో తరగతి వరకు సైన్స్, సోషల్‌ స్టడీస్, గణితంపై పట్టు సాధించాలి. వివిధ సబ్జెక్టులలో పాఠ్యాంశాలను లోతుగా అధ్యయనం చేయడంతో పాటు ముఖ్యమైన అంశాలను స్వదస్తూరితో రాసుకోవాలి. దీంతో రాయడంలో వేగం, నైపుణ్యం పెరుగుతాయని నిపుణులు  సూచిస్తున్నారు.  


 
సమకాలీన అంశాలపై ప్రిపేర్‌ కావాలి.. 
సమకాలీన అంశాలు, సాధారణ పరిజ్ఞానంపై పట్టు పెంచాలి. పోటీ పరీక్షలలో వచ్చే  ప్రశ్నల తీరు మారింది. అభ్యర్థుల విస్తృతమైన, లోతైన అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించేలా ఈ ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకు ఉక్రెయిన్‌ యుద్ధానికి నాలుగు కారణాలను ఇచ్చి అందులో ప్రధానమైన కారణమేంటని అడగవచ్చు. నాలుగింటిలో ఏది ప్రధానమో తేల్చుకోవాలంటే సమకాలీన ఘటనలు, పరిణామాలపై స్పష్టత తప్పనిసరి. కొంతకాలంగా ప్రశ్నల తీరు మారింది. అందుకనుగుణంగానే ప్రిపరేషన్‌ ఉండాలి.  

గందరగోళానికి గురికావొద్దు..
ఒక సబ్జెక్టుపై ఒకటి, రెండు ప్రామాణికమైన పుస్తకాలను మాత్రమే ఎంపికచేసుకొని లోతుగా అధ్యయనం చేయాలి. ఎస్సై ఉద్యోగాలు, గ్రూప్‌–1, గ్రూప్‌–2, వంటి  పరీక్షల కోసం చదివేవాళ్లకు గణితం, రీజనింగ్, అరిథ్‌మెటిక్‌ వంటి అంశాల్లో  శిక్షణ తప్పనిసరిగా అవసరం.
– వి.వేణుగోపాల్, గణితశాస్త్ర నిపుణులు 
 
దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి 
ఏ పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే వాళ్లయినా సరే హడావుడిగా చదవకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో  ప్రారంభించాలి. ఇప్పటికే చదువుతున్న వాళ్లు  అధ్యయనానికి మరింత పదును పెట్టాలి, కొత్తగా  ప్రారంభించేవాళ్లు చక్కటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. ఆందోళన వద్దు, కోచింగ్‌ సెంటర్‌ల ఎంపిక ఎంతో కీలకం.  
– కేవీఆర్, ఇంగ్లిష్‌ ఫ్యాకల్టీ 
 

మరిన్ని వార్తలు