ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

18 Oct, 2021 19:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతేడాది మాదిరే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ప్రగతిభవన్‌లో ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు.

మద్దతు ధర ప్రకారమే ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. ధాన్యం సేకరణకు 6,545 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, ప్రియాంకవర్గీస్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు