రూల్‌ కర్వ్‌ ఓకే అయితే.. శ్రీశైలం, సాగర్‌ అప్పగిస్తాం!

29 May, 2022 01:58 IST|Sakshi

కృష్ణా బోర్డుకు స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం

త్వరగా నిబంధనలు ఖరారు చేయాలని విజ్ఞప్తి

ఆర్డీఎస్‌ ఆధునీకరణ తర్వాత తుమ్మిళ్లకు మంగళం

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నిర్వహణకు సంబంధించిన రూల్‌ కర్వ్‌లపై అంగీకారానికి వచ్చాక.. రెండు జలాశయాలను కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ)కు అప్పగిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. జలాశయాల అప్పగింత పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేదని.. రూల్వ్‌ కర్వ్‌లకు తుది రూపునిచ్చే ప్రక్రియను వేగిరం చేయాలని కోరింది.

ఈ నెల 6న జరిగిన కృష్ణాబోర్డు 16వ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఆ సమావేశానికి సంబంధించి ఇరు రాష్ట్రాల వాదనలు, అభిప్రాయాల మినిట్స్‌ను కృష్ణా బోర్డు తాజాగా ఈ మేరకు రెండు రాష్ట్రాలకు పంపింది.

ట్రిబ్యునల్‌ తీర్పునకు అనుగుణంగా..
ఆ మినిట్స్‌ ప్రకారం.. రూల్వ్‌ కర్వ్‌ ఖరారైన తర్వాత ప్రాజెక్టుల అప్పగింతకు అవసరమైన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ సైతం కృష్ణాబోర్డుకు హామీ ఇచ్చారు. కృష్ణా ట్రిబ్యునల్‌–1 తీర్పునకు అనుగుణంగా రూల్‌ కర్వ్‌ ఉండాలనే రాష్ట్ర ప్రభుత్వం సవరణలను కోరిందని గుర్తు చేశారు.

ప్రాజెక్టుల అప్పగింతలో అనుసరించాల్సిన రోడ్‌ మ్యాప్‌ తయారీపై సబ్‌ కమిటీకి పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ జెన్‌కో డైరెక్టర్‌ (హైడల్‌) వెంకటరాజం కృష్ణాబోర్డుకు హామీ ఇచ్చారు. మరోవైపు రూల్వ్‌ కర్వ్‌లతో ప్రాజెక్టుల అప్పగింతకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి, ఈఎన్‌సీ అభ్యంతరం తెలిపారు. ప్రాజెక్టుల అప్పగింతను తెలంగాణ వేగిరం చేయాలని ఈ సందర్భంగా బోర్డు చైర్మన్‌ ఆదేశించారు.

ఆధునీకరణ తర్వాత తుమ్మిళ్లను వాడం
ఆర్డీఎస్‌ ఆనకట్ట ఆధునీకరణ పూర్తయిన తర్వాత తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని వినియోగించబోమని రజత్‌కుమార్‌ కృష్ణా బోర్డుకు హామీ ఇచ్చారు. తుంగభద్ర రిజర్వాయర్‌ నుంచి 15.9 టీఎంసీల కోటా నీరు ఆర్డీఎస్‌ ఎడమ కాల్వకు రాకపోవడంతోనే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. ఆర్డీఎస్‌ ఆధునీకరణ తర్వాత గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని, తుమ్మిళ్ల ఎత్తిపోతల అవసరం ఉండదని, భారీ విద్యుత్‌ బిల్లులు సైతం మిగులుతాయని పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆర్డీఎస్‌ కుడి ప్రధాన కాల్వ నిర్మాణానికి సంబంధించిన పేరాను ఆర్డీఎస్‌ ఆనకట్ట ఆధునీకరణ రోడ్‌మ్యాప్‌ నుంచి తొలగించాలని ఏపీ చేసిన విజ్ఞప్తి పట్ల సమ్మతి తెలిపారు. ఇక కృష్ణా ట్రిబ్యునల్‌–2 తీర్పు అమల్లోకి వచ్చేవరకు మల్లమ్మకుంట రిజర్వాయర్‌ నిర్మాణాన్ని నిలిపేసేందుకు తెలంగాణ అంగీకరించినట్టు సమావేశం మినిట్స్‌లో కృష్ణాబోర్డు పేర్కొంది.

ఏమిటీ రూల్‌ కర్వ్‌?
జలాశయాలకు సంవత్సరం పొడవునా ఎప్పుడెప్పుడు, ఏయే పరిమాణాల్లో నీళ్లు వస్తే.. అందులో నుంచి ఎప్పుడెప్పుడు, ఎంతెంత నీటిని తీసుకోవచ్చనే నిబంధనలను రూల్‌ కరŠవ్స్‌ అంటారు. జలాశయం గేట్లను ఎప్పుడెప్పుడు ఎత్తాలి?, ఏయే నెలల్లో ఎంతెంత కనీస నీటి మట్టాన్ని ఉంచాలన్న అంశాలను కూడా అందులో పేర్కొంటారు.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు సంబంధించి.. తెలంగాణ, ఏపీలకు ఎంతెంత నీటిని కేటాయించాలన్న దానిపై గతంలో సీడబ్ల్యూసీ రూల్‌ కరŠవ్స్‌ను రూపొందించింది. అందులో పలు అంశాలను సవరించి తుది నిబంధనలను ఖరారు చేయాలని తెలంగాణ కోరింది.  

మరిన్ని వార్తలు