వారం వారం.. ప్రగతి లక్ష్యం.. కొత్త విధానానికి శ్రీకారం

19 Sep, 2022 01:54 IST|Sakshi

ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాల సత్వర అమలు లక్ష్యం

ప్రతి ఆదివారం ఆయా అంశాల్లో సాధించాల్సిన పురోగతిపై దిశానిర్దేశం

ఈ వారం పోడు భూములు, ఆసరా పింఛన్లు, సహా ఐదు లక్ష్యాల విధింపు

యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాలని ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాలన యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టించి, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలను సత్వరంగా అమలు చేయడంలో భాగంగా జిల్లా కలెక్టర్లకు వారం వారం లక్ష్యాలను నిర్దేశించే కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శ్రీకారం చుట్టారు. ప్రతి ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్లకు వాట్సాప్‌ ద్వారా.. సోమవారం నుంచి వారం రోజుల పాటు దృష్టి సారించాల్సిన అంశాలు, సాధించాల్సిన పురోగతిపై స్పష్టమైన లక్ష్యాలను విధిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో కుంటి నడకతో..
    రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయికి వెళ్లే సరికి ముందుకు పురోగమించడం లేదు. క్షేత్ర స్థాయి అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తతతో కొన్ని ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో తలెత్తుతున్న సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలపై విస్తృత రీతిలో సమీక్షలు జరుపుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో కొంతకాలం అధికార యంత్రాంగం హడావుడి చేసినా సమస్యలు కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే సీఎస్‌ చర్యలు చేపట్టారు. ప్రాధాన్యత అంశాల అమలుపై ప్రతివారం లక్ష్యాలను నిర్దేశించి పురోగతిని సమీక్షించాలని నిర్ణయించారు. తాజాగా ఈ వారం ఐదు అంశాలపై దృష్టి సారించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాలని సూచించారు.

1. పోడుపై సమన్వయ కమిటీ సమావేశాలు
    గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల సమస్యకు పరిష్కారం కల్పించడంలో భాగంగా ఈ వారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలి.  గ్రామ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన, పరిష్కారానికి గడువు నిర్దేశించుకోవాలి. ఎప్పటిలోగా ఈ పనిని పూర్తి చేస్తారో తెలియజేయాలి.

2. పెన్షన్‌ కార్డుల పంపిణీ పూర్తి చేయాలి
ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా పెన్షన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ వారంలోగా పూర్తి చేయాలి. గ్రామ పంచాయతీ స్థాయిలో పంపిణీ చేపట్టాలి. ఒక్కో ఎమ్మెల్యే రోజుకు 8 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. కార్యక్రమం పూర్తికి లక్షిత తేదీని తెలియజేయాలి.

3. క్రమబద్ధీకరణ దరఖాస్తులు పరిశీలించాలి
ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పేదలు నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించడానికి జారీ చేసిన జీవో 59 కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలను ప్రారంభించి రెండు వారాల్లోగా పూర్తి చేయాలి. ఇందుకు సరిపడ సంఖ్యలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. మొబైల్‌ యాప్‌ ద్వారా దరఖాస్తుల పరిశీలన జరపాలి.

4. ధరణి సమస్యలకు సత్వర పరిష్కారం
ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా టీఎం33 కింద ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పట్టాదారు పేరు, విస్తీర్ణం, భూమి స్వభావం, మిస్సింగ్‌ సర్వే నంబర్ల నమోదు గురించి వచ్చే దరఖాస్తులను పరిష్కరించాలి. ఎన్ని దరఖాస్తులు ఆమోదించారో, ఎన్ని తిరస్కరించాలో ఎప్పటికప్పుడు వివరాలు పంపాలి. ముఖ్యంగా నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించాలని కోరుతూ వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలి.

5. విషాహార ఘటనలు పునరావృతం కావొద్దు
రాష్ట్రంలోని గురుకుల, కేజీబీవీ వసతి గృహాల్లో విషాహార ఘటనలు పునరావృతం కాకూడదు. ఈ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యహరించాలి. పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.

ఇదీ చదవండి: ఎన్‌ఐఏ పంజా.. నిజామాబాద్‌ కేంద్రంగా ఉగ్రవాద శిక్షణపై ఫోకస్‌

మరిన్ని వార్తలు