కాళేశ్వరం అనుమతులు పునరుద్ధరించాలి 

23 Sep, 2022 02:13 IST|Sakshi

నిలుపుచేసే అధికారం గోదావరి బోర్డుకు లేదు 

కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ  

సాక్షి, హైదరాబాద్‌: సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండడాన్ని కారణంగా చూపి, కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు అనుమతులు జారీ చేసే ప్రక్రియను గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) నిలిపివేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. అనుమతుల ప్రక్రియను పునరుద్ధరించేలా గోదావరి బోర్డును ఆదేశించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ కేంద్ర జలశక్తి శాఖకు బుధవారం లేఖ రాశారు.

అనుమతులు లేకుండా చేపట్టిన అదనపు టీఎంసీ పనుల విషయంలో మాత్రమే యధాతథాస్థితి కొనసాగించాలని సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని లేఖలో స్పష్టం చేశారు. అన్ని అనుమతులున్న కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగానే అదనపు టీఎంసీ పనులను చేపట్టినట్టు ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా కలసి నివేదించినట్టు గుర్తు చేశారు.

గెజిట్‌ నోటిఫికేషన్‌లో పొందుపర్చిన అనుమతి లేని జాబితాల నుంచి అదనపు టీఎంసీ పనుల భాగాన్ని తొలగించాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి శాఖ మధ్య ఈ ప్రాజెక్టు విషయంలో ఆ తర్వాత కాలంలో సమగ్ర చర్చలు జరిగాయన్నారు. సీడబ్ల్యూసీ కోరిన అన్ని రకాల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని వివరించారు.

ఆ తర్వాతే ఈ ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాలని గోదావరి బోర్డుకు సీడబ్ల్యూసీ సిఫారసు చేసిందన్నారు. ఈ దశలో అనుమతుల ప్రక్రియను గోదావరి బోర్డు నిలుపుదల చేస్తే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతుల ప్రక్రియను సత్వరంగా పూర్తి చేయాలని గోదావరి బోర్డును ఆదేశించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.  

గోదావరి బోర్డు అత్యుత్సాహం.. 
 సీడబ్ల్యూసీ సిఫారసు చేసిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు సవరణ డీపీఆర్‌కు అనుమతుల ప్రక్రియను నిలుపుదల చేసే అధికారం గోదావరి బోర్డుకు లేదని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. డీపీఆర్‌ను పరిశీలించిన తర్వాత వాటిని బోర్డు సమావేశంలో ఉంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయాలను గోదావరి బోర్డు స్వీకరించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

ఆ తర్వాత సీడబ్ల్యూసీలోని టెక్నికల్‌ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ)కి డీపీఆర్‌ను గోదావరి బోర్డు పంపించాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. టీఏసీ క్లియరెన్స్‌ లభించిన తర్వాత అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించి ప్రాజెక్టుకు అనుమతి ఇస్తారని అధికారులు చెపుతున్నారు. అనుమతుల ప్రక్రియను నిలుపుదల చేసి గోదావరి బోర్డు అత్యుత్సాహం ప్రదర్శించిందని విమర్శిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సవరణ డీపీఆర్‌ను బోర్డు వెనక్కి తిప్పి పంపలేదని, కేవలం పరిశీలన జరపడానికి నిరాకరించిందని ఓ అధికారి తెలిపారు.   

మరిన్ని వార్తలు