చారిత్రక అన్యాయాలను సరిదిద్దాలి

20 Dec, 2021 04:50 IST|Sakshi

కల్వకుర్తి రెండో కాంపోనెంట్‌ను గెజిట్‌ నుంచి తొలగించాలికృష్ణా బోర్డుకు మరోసారి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కేంద్రం రెండు విభాగాలుగా గెజిట్‌ నోటిఫికేషన్‌లో పొందుపర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రాజెక్టులకు జరిగిన చారిత్రక అన్యాయాలను సరి చేయాలని, గెజిట్‌ నోటిఫికేషన్‌ నుంచి కల్వకుర్తి రెండో భాగాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేసింది. ఒకే విభాగంగా పొందుపర్చాలంటూ నీటిపారుదల శాఖ ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ సి.మురళీధర్‌ ఆదివారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు మరోసారి లేఖ రాశారు.

2.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు 25 టీఎంసీల నీటి తరలింపు సామర్థ్యంతో ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కాంపోనెంట్‌–1గా, నీటి తరలింపును 40 టీఎంసీలకు పెంచడంద్వారా ఆయకట్టును 3.65 లక్షల ఎకరాలకు పెంచేందుకు తెలంగాణ ఏర్పడ్డాక చేపట్టిన ప్రాజెక్టు విస్తరణ పనులను కాంపోనెంట్‌–2గా గెజిట్‌ నోటిఫికేషన్‌లోకేంద్రం పేర్కొంది. ఒకే ప్రాజెక్టును రెండు విభాగాలుగా చూపడం సరికాదని లేఖలో తప్పుబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టును 2.5 లక్షల ఎకరాల నుంచి 3.65 లక్షల ఎకరాలకు పెంచారని, నీటి కేటాయింపులను ఇందుకు అనుగుణంగా పెంచలేదని స్పష్టం చేశారు. ఆయకట్టు పెంచుతూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవోలు సైతం జారీ చేసిందని గుర్తుచేశారు. అప్పట్లో పెంచిన ఆయకట్టుకే తెలంగాణ ప్రభుత్వం సరిపడా నీటి కేటాయింపులు చేసిందని, కొత్తగా ఆయకట్టు పెంచలేదన్నారు. కొత్త వనరుల నుంచి నీటిని తీసుకోవడం లేదన్నారు. 

మా ప్రాజెక్టులు కృష్ణా బేసిన్‌లోవే.. ఏపీవి కావు! 
శ్రీశైలం జలాశయంలో 800కుపైగా అడుగుల వద్ద నుంచి నీటిని తోడేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల నిర్మిస్తామని 2006లో బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం డీపీఆర్‌ సమర్పించిందని తెలంగాణ గుర్తుచేసింది. 885 అడుగులపైన నీటిమట్టం నుంచి నీటిని తోడుకొనేలా గాలేరు–నగరి, వెలిగొండ, హంద్రినీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను డిజైన్‌ చేసినట్లు బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు సమర్పించిందని పేర్కొంది.

కల్వకుర్తి ఎత్తిపోతల కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టే కావడంతో అప్పట్లో శ్రీశైలం జలాశయంలోని 800 అడుగుల నీటిమట్టం వద్ద నుంచి నీటిని తోడేలా డిజైన్‌ చేశారని తెలిపింది. పరీవాహక ప్రాంతం వెలుపలి ప్రాజెక్టులు కావడంతో గాలేరు–నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ వంటి ఆంధ్ర ప్రాజెక్టులను శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగుల నుంచి నీటిని తీసుకొనేలా డిజైన్‌ చేశారని స్పష్టం చేసింది. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను సైతం ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఇదే కారణంగా 800కుపైగా అడుగుల నుంచి నీటిని తోడుకొనే విధంగా డిజైన్‌ చేసినట్లు వివరించింది. 75 శాతం నిల్వ ఆధారిత నికర జలాలను కల్వకుర్తికి కేటాయించాలని కృష్ణా ట్రిబ్యునల్‌–2 ముందు వాదించామని తెలిపింది. గాలేరు–నగరి, వెలిగొండ, హంద్రీనీవా తదితర ప్రాజెక్టులకు మిగులు జలాలనే ఏపీ కోరిందని, 75 శాతం నిల్వ ఆధారిత నికర జలాలు కేటాయించాలని కోరలేదని తెలిపింది.   

మరిన్ని వార్తలు