ధాన్యం కొనుగోళ్లకు 12 వేల కోట్ల బ్యాంక్‌ రుణం

19 Apr, 2022 04:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్‌ టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం బ్యాంకుల నుంచి రూ.12 వేల కోట్ల రుణం తీసుకోనుంది. మరోవైపు 6,983 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా కోతలు మొదలైన జిల్లాల్లో ఇప్పటికే 536 కేంద్రాలను ఏర్పాటు చేసి 1,200 టన్నుల మేర ధాన్యం కొనుగోలు చేసింది. అలాగే ధాన్యం కొనుగోలుకు 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవగా ఇప్పటివరకు 1.6 కోట్ల గన్నీ బ్యాగులను సేకరించింది. మరో 6.15 కోట్ల బ్యాగుల కోసం ఆర్డర్‌ ఇవ్వగా ఇంకో 8 కోట్ల బ్యాగులను టెండర్‌ ద్వారా సేకరించనుంది.

అందుబాటులో రూ. 4,350 కోట్లు .. 
ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైతే రైతులకు చెల్లించేందుకు అవసరమైన నిధులను కూడా పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం ఈ శాఖ దగ్గర రూ. 4,350 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తంతో 22 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయవచ్చు. కాగా, కేంద్రం కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) చెల్లింపులు ప్రతిరోజు రూ.40 కోట్ల వరకే చేసేలా ఫ్రీజింగ్‌ పెట్టడంతో రాష్ట్రంలో ధాన్యం సేకరణ పరిస్థితిని వివరించి ఒకేరోజు రూ.1,900 కోట్లు విడుదలయ్యేలా మంత్రి గంగుల కమలాకర్‌ చర్యలు తీసుకున్నారు. కాగా, వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణకు ధాన్యం రాకుండా నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 51 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు మంత్రి గంగుల తెలిపారు.  

మరిన్ని వార్తలు