స్వగృహ వేలం 2.0

9 Oct, 2022 01:59 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా ప్లాట్లు, గృహాలు, ఖాళీ స్థలాల వేలానికి ప్రభుత్వం నిర్ణయం

ఈ నెల 11న వేలం ప్రకటన.. 14 నుంచి ప్రక్రియ ప్రారంభం

10 జిల్లాల పరిధిలోని 19 ప్రాంతాల్లో ఆస్తుల విక్రయం

సర్కారు ఖజానాకు కనీసం రూ.1,000 కోట్లు వస్తాయని అంచనా

తొలి విడత వేలంలో రూ. 503 కోట్లు సమకూర్చుకున్న సర్కారు

ఖజానాకు ఆదాయం కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిపెట్టిన సర్కారు.. మరో విడత ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ ఆస్తుల రెండో విడత వేలానికి ఏర్పాట్లు చేస్తోంది. 10 జిల్లాల పరిధిలోని 19 ప్రాంతాల్లో ఉన్న నివాస, వాణిజ్య స్థలాలతోపాటు గృహాల జాబితాలను సిద్ధం చేసింది.

తొలి విడతలో 9 జిల్లాల పరిధిలోని రాజీవ్‌ స్వగృహ ఆస్తులను విక్రయించి, రూ.503 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సర్కారు.. ఈసారి కనీసం రూ.1,000 కోట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది.

మూడు రోజుల్లో ప్రకటన
రెండో విడత స్వగృహ ఆస్తుల వేలానికి ఈ నెల 11న వేలం ప్రకటన జారీ చేయనున్నారు. 14వ తేదీ నుంచే వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రభుత్వ ఆస్తుల వేలం ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.9 వేల కోట్లను సమకూర్చుకోవాలని రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఇటీవల గ్రేటర్‌ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను వేలం వేసి దాదాపు రూ.నాలుగు వేల కోట్లను సమీకరించింది. తాజాగా రెండో విడత స్వగృహ ఆస్తుల వేలం నిర్వహిస్తోంది.

ప్లాట్లు, ఇళ్లతోపాటు ఖాళీ స్థలాలు కూడా..
ఈ–వేలంతో పాటు భౌతికంగా నేరుగానూ వేలం నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరు, తుర్కయాంజల్, కుర్మాలగూడ, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా బహదూర్‌పల్లి ప్రాంతాల్లోని రెసిడెన్షియల్‌ ప్లాట్లతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌ లేఅవుట్‌లోని కమర్షియల్‌ ప్లాట్లకు హెచ్‌ఎండీఏ ఆన్‌లైన్‌ ద్వారా వేలం నిర్వహించనుంది. రంగారెడ్డి జిల్లా చందానగర్, కవాడిపల్లిలోని ప్లాట్లకు టీఎస్‌ఐఐసీ ఆన్‌లైన్‌ ద్వారా వేలం జరపనుంది.

ఆదిలాబాద్‌ జిల్లాలోని బీఎస్‌ గావ్, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమిస్తాపూర్, పోతులమడుగు, నిజామాబాద్‌ జిల్లాలోని మల్లారం, కామారెడ్డి జిల్లాలోని అడ్లూరు, నల్లగొండ జిల్లాలోని ఎల్లారెడ్డిగూడ, కరీంనగర్‌ జిల్లాలోని నుస్తులాపూర్‌లలోని ప్లాట్లు.. వికారాబాద్‌ జిల్లాలోని ఆలంపల్లి, గంగారాం ప్రాంతాల్లోని రెండు ఖాళీస్థలాలకు ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సాధారణ వేలం నిర్వహించనున్నారు.

ఖమ్మం టౌన్‌షిప్‌లోని 6.9 ఎకరాల ఖాళీ స్థలానికి స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ ఎకరాకు రూ.3 కోట్ల కనీస ధరతో వేలం పాట చేపడతారు. నివాస ప్లాట్లకు కనీస ధర (అప్‌సెట్‌ ప్రైస్‌)గా చదరపు గజానికి.. జిల్లాల్లో రూ.7 వేల నుంచి రూ.12 వేలు, హెచ్‌ఎండీఏ/టీఎస్‌ఐఐసీ పరిధిలో రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు ఖరారు చేశారు. గృహాల విషయానికి వస్తే.. చదరపు గజానికి రూ.10,500, రూ.12 వేలు కనీస ధర నిర్ణయించారు.

వేలానికి అంతా సర్వ సన్నద్ధం
రాజీవ్‌ స్వగృహ ఆస్తుల వేలంపై రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ శనివారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ అధికారులు, సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ అధికారులు, జిల్లా కలెక్టర్లు వేలానికి సర్వ సన్నద్ధంగా ఉన్నట్టు సీఎస్‌కు నివేదించారు. వేలం వేయనున్న ఆస్తుల వివరాలు, లేఅవుట్లు, సైట్‌ ఫోటోలు, వేలం విధానం తదితర వివరాలను సంబంధిత సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా అరవింద్‌ కుమార్‌ ఆదేశించారు. 

మరిన్ని వార్తలు