దూకుడుకు కళ్లెం పడేనా?

24 Sep, 2021 03:41 IST|Sakshi

నదీ బోర్డుల గెజిట్‌పై అభ్యంతరాలు మరోమారు కేంద్రం దృష్టికి

అమలును వాయిదా వేయించే దిశగా రాష్ట్ర సర్కారు అడుగులు

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం వెలువరించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు అటు కేంద్రం, ఇటు బోర్డులు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, దీనిని అడ్డుకునే దిశగా తెలంగాణ మరోమారు రంగంలోకి దిగుతోంది. అక్టోబర్‌ 14నుంచి గెజిట్‌ అమల్లోకి వచ్చేందుకు కేవలం 20 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అయితే ఇంతవరకు బోర్డుల స్వరూపమే సిద్ధం కాలేదనే కారణంతో గెజిట్‌ అమలు వాయిదా వేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు మరోమారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ను కలవాలని నిర్ణయించారు. ఈ నెల 25న షెకావత్‌తో భేటీ కానున్న సీఎం..గెజిట్‌పైనే చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

గెజిట్‌ అమలుపై చర్యలు వేగిరం
ఈ నెల 6న భేటీ సందర్భంగా కూడా గెజిట్‌ అమలును వాయిదా వేయాలని షెకావత్‌ను కేసీఆర్‌  కోరారు. అమలుకు గడువు తక్కువగా ఉండ డంతో.. సిబ్బంది నియామకం, వ్యవస్థ స్థాపన, ప్రాజెక్టులకు అనుమతులు, పర్యవేక్షణ తదితర సమస్యలు ఆటంకంగా మారతాయని వివరిం చారు. దీనిపై ఆ భేటీలో కేంద్రం ఎలాంటి నిర్ణయం చెప్పకున్నా, తర్వాతైనా సానుకూలంగా స్పందించ వచ్చని తెలంగాణ ఎదురుచూసింది. అయితే దీనిపై ఎలాంటి సానుకూల నిర్ణయాలు వెలువడక పోగా.. గెజిట్‌ అమలు దిశగా కేంద్రం, బోర్డులు చర్యలు వేగిరం చేశాయి. గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది నియామకం అంశాన్ని తెరపైకి తెచ్చాయి.

సీఐఎస్‌ ఎఫ్‌ సిబ్బందికి అవసరమయ్యే వసతి సౌకర్యాలు, మౌలిక వసతులు, వాహనాలు, కార్యాలయాల ఏర్పాటు, వారి జీతభత్యాలకు సంబంధించి ఓ ముసాయిదా పత్రాన్ని అందజేసి దానిపై ప్రభుత్వా ల వివరణలు కోరాయి. రెండు నదీ బేసిన్‌లపై ఉన్న ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాల వివరాలతో పాటు ప్రాజెక్టుల డీపీఆర్‌ లను పది రోజుల్లో తమకు సమర్పించాలని ఆదేశిం చాయి. ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌ చూస్తున్న ఏజెన్సీల వివరాలు కోరాయి.

వివాదాలపై విన్నపాలు..:
బోర్డుల వేగాన్ని చూస్తే అక్టోబర్‌ 14 నుంచి గెజిట్‌ అమలు పక్కాగా ఉండనుందని తెలుస్తోంది. దీనిపై వెనకడుగు వేసే పరిస్థితులు కానరావడం లేదు. అయితే మరోపక్క గోదావరి మళ్లింపు జలాల అంశంపై ఏపీ, తెలం గాణ మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గెజిట్‌ అమలు విషయంలో ఉన్న అభ్యంతరాలను సీఎం కేసీఆర్‌  కేంద్రమంత్రికి విన్నవించే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు