ఎరువుల కొనుగోళ్లకు సమాయత్తం

15 Nov, 2022 03:11 IST|Sakshi
పాలకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న  మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ గంగారెడ్డి 

యాసంగిలో 95 వేల మెట్రిక్‌ టన్నుల అవసరం

రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ పాలకవర్గ సమావేశంలో చైర్మన్‌ గంగారెడ్డి

ఖమ్మం వ్యవసాయం: ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో ఎరువుల కొనుగోళ్లకు రూ.700 కోట్లు రుణం తీసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి తెలిపారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ 23వ పాలకవర్గ సమావేశం సోమవారం ఖమ్మంలోని డీపీఆర్‌సీ సమావేశ మందిరంలో చైర్మన్‌ గంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022–23 ఏడాది వానాకాలంలో 4.57 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేసినట్లు తెలిపారు.

ప్రస్తుత యాసంగికి 95 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువుల అవసరముంటుందని వెల్లడించారు. దీంతో పలు కంపెనీల నుంచి కొనుగోలుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. అలాగే కనీస మద్దతు ధరతో పెసలు కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను నోడల్‌ ఏజెన్సీగా నియమించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 3,397 మెట్రిక్‌ టన్నుల పెసలు, 4 వేల మెట్రిక్‌ టన్నుల మినుముల కొనుగోళ్లకు అనుమతించిందని, ఈ పంట కొనుగోళ్లపై జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశామని గంగారెడ్డి పేర్కొన్నారు.

కనీస మద్దతు ధరతో 72,387 మెట్రిక్‌ టన్నుల సోయాబీన్‌ కొనుగోలుకు అనుమతి కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించామని తెలిపారు. సమావేశంలో మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ యాదిరెడ్డి, డైరెక్టర్లు రంగారావు, విజయ్, గంగాచరణ్, జగన్‌మోహన్‌రెడ్డి, మర్రి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు