క్లబ్బులు, అన్ని రకాల బార్లు ఇక ఓపెన్‌..

26 Sep, 2020 05:04 IST|Sakshi

కరోనా నిబంధనలకు అనుగుణంగా బార్లు, క్లబ్బులు తెరిచేందుకు అనుమతి

టూరిజం క్లబ్బులకూ గ్రీన్‌సిగ్నల్‌.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

వైన్‌ షాపుల పర్మిట్‌ రూంలకు మాత్రం నో పర్మిషన్‌

డ్యాన్సులు, మ్యూజిక్‌ ఈవెంట్లపై నిషేధంతో పబ్బులు తెరిచేది డౌటే  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో గత ఆరు నెలలుగా (మార్చి 14 నుంచి) మూతబడిన బార్లు, క్లబ్బులు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. తెలంగాణవ్యాప్తంగా ఉన్న బార్లు, క్లబ్బులను తక్షణమే తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులను తక్షణమే తెర వచ్చు. అయితే ఆయా ప్రదేశాల్లో సమూహాల ఏర్పాటు, మ్యూజికల్‌ ఈవెంట్లు, డ్యాన్స్‌ ఫ్లోర్లపై నిషేధం కొనసాగుతుంది. దీంతో పబ్బులు మళ్లీ తెరుస్తారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెల కొంది. అయితే బార్లకు అనుమతిచ్చిన ప్రభు త్వం వైన్‌షాపుల వద్ద పర్మిట్‌ రూంలపై ఉన్న నిషేధాజ్ఞలను ఎత్తేయలేదు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పర్మిట్‌ రూంలపై నిషేధం కొనసాగు తుందని ఉత్తర్వుల్లో సీఎస్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వం విధించిన షరతులు...
బార్లలో ప్రవేశద్వారం వద్దే థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాలి. థర్మల్‌ స్క్రీనింగ్‌ స్పర్శరహితంగా ఉండాలి.
బార్లు, క్లబ్బుల్లో పరిశుభ్రత పాటించాలి. నిబంధనలకు అనుగుణంగా క్యూ పద్ధతి పాటించాలి.
పార్కింగ్‌ ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలి.
హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. బార్‌ సిబ్బంది కచ్చితంగా మాస్క్‌లు ధరించి సర్వీసు చేయాలి.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు బార్‌ ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో శుభ్రపరచాలి. కస్టమర్‌ మారే ప్రతిసారీ సీట్లను శానిటైజ్‌ చేయాలి. 
బార్లు, క్లబ్బుల ప్రాంగణాల్లో గాలి, వెలుతురు వచ్చేలా చర్యలు చేపట్టాలి.  

మరిన్ని వార్తలు