పూర్తయిన పాఠాలపైనే విద్యార్థులకు పరీక్షలు!

20 Jan, 2021 08:02 IST|Sakshi

ఏయే సిలబస్‌ తగ్గిస్తారన్న దానిపై వెలువడని అధికారిక ప్రకటన

పాఠశాలల సిలబస్‌పై ఇంతవరకూ నిర్ణయం తీసుకోని ప్రభుత్వం

ఇంటర్‌ సిలబస్‌ తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నా వెల్లడించని పరిస్థితి

ఈసారి ఇంటర్మీడియట్‌లో ఇంటర్నల్స్‌ విధానం లేనట్టే..

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కారణంగా అస్తవ్యస్తంగా మారిన విద్యా బోధనను గాడిలో పెట్టే పనిలో ప్రభుత్వం పడింది. ఇందులో భాగంగా 9, 10వ తరగతులతోపాటు ఇంటర్, డిగ్రీ, పీజీ తరగతులను ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందుకు అవసరమైన చర్యలపై కార్యాచరణ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రధానమైన సిలబస్, పరీక్షల విధానంపై దృష్టి సారించాయి. ప్రస్తుతం 1 నుంచి 8వ తరగతి వరకు ప్రత్యక్ష విద్యా బోధనపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఇప్పటివరకు ఆన్‌లైన్‌/ టీశాట్‌/ దూరదర్శన్‌ ద్వారా ప్రసారం చేసిన వీడియో పాఠాలపైనే పరీక్షలు నిర్వహించాలా? లేదంటే పరీక్షలే లేకుండా పైతరగతులకు పంపించాలా అనే దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఎక్కువ శాతం అధికారులు మాత్రం 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలే అవసరం లేదని పేర్కొంటున్నారు.

ప్రభుత్వం కూడా ఆ దిశగానే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 9, 10వ తరగతుల వారికి మాత్రం మాత్రం పరీక్షలు నిర్వహించాల్సిందేనన్న భావనలో పాఠశాల విద్యా శాఖ అధికారులు ఉన్నారు. 70 శాతం సిలబస్‌ మాత్రమే ఉండేలా ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మిగతా 30 శాతం సిలబస్‌లో ప్రాజెక్టులు, అసైన్‌మెంట్‌ ఆధారిత ఇంటర్నల్స్‌ ఉంటాయని పేర్కొంది. సీనియర్‌ అధికారులు మాత్రం పాఠశాలలు ప్రారంభమయ్యాక పూర్తి చేసే సిలబస్, ప్రస్తుతం ఆన్‌లైన్‌/ టీవీ ద్వారా ప్రసారం చేసిన పాఠాలపైనే పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నారు. వచ్చే ఏప్రిల్‌ నాటికి పూర్తయ్యే పాఠ్యాంశాల్లో ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లతో ఇంటర్నల్‌ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. వాటి ఆధారంగా విద్యార్థులకు మార్కులను ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీనిపై కూడా ఇంతవరకు అధికారిక నిర్ణయం లేదు. ఇకనైనా ప్రభుత్వం సిలబస్‌ కుదింపుపై స్పష్టత ఇస్తే ఆ విధానం కొనసాగుతుందని, లేదంటే ఏప్రిల్‌ నాటికి అయ్యే పాఠ్యాంశాలపై మాత్రమే ఇంటర్నల్‌ పరీక్షలు నిర్వహించి విద్యాసంవత్సరాన్ని ముగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇంటర్‌లో..
ఇంటర్‌లోనూ ఇదే పరిస్థితి ఇంటర్మీడియట్‌ సిలబస్‌ విషయంలోనూ గందరగోళం కొనసాగుతోంది. అధికారులు ఇంతవరకు సిలబస్‌ కుదింపుపై తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. గతంలో 30 శాతం సిలబస్‌ ను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అందులో తెలంగాణ పండుగలు, జాతీయనేతలు, సంఘసంస్కర్తల పాఠాలు తొలగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తడంతో.. అది నిర్ణయం కాదని, అలాంటి పాఠ్యాంశాలను తొలగించట్లేదని, పైగా అది ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మాత్రమేనని బోర్డు అధికారులు ప్రకటించారు. అయితే ప్రభుత్వం 30 శాతం సిలబస్‌ కుదింపునకు ఓకే చెప్పినట్లు తెలిసింది. తగ్గించిన సిలబస్‌ను ప్రకటించలేదు.  ఇంటర్మీడియట్‌ సిలబస్‌ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలతో ముడిపడి ఉన్నందున లెక్చరర్లు, విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. జేఈఈ మెయిన్‌ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో సిలబస్‌ కుదింపు లేదు. కేవలం విద్యార్థులకు ప్రశ్నల సంఖ్యను పెంచి ఆప్షన్లు ఎక్కువగా ఇచ్చారు. కాబట్టి విద్యార్థులు ఉన్న సిలబస్‌ మొత్తం ప్రిపేర్‌ కావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు వొకేషనల్‌ కోర్సుల సిలబస్‌ తగ్గింపుపైనా బోర్డు  కసరత్తు చేయలేదు.

మరిన్ని వార్తలు