Telangana Dalit Bandhu: ‘దళితబంధు’ విస్తరణ.. ఒక్కో నియోజకవర్గంలో 1,500 మంది చొప్పున

4 Sep, 2022 04:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దళితబంధు పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి 100 మంది చొప్పున అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాన్ని అమలు చేసిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గంలో 1,500 మంది చొప్పున లబ్ధిదారులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. తొలి దశలో ఒక్కో నియోజకవర్గానికి 500 మంది చొప్పున 118 నియోజకవర్గాల్లో (హుజూరాబాద్‌ మినహా) అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి పథకం అమలు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం ప్రగతి భవన్‌లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. 

మరిన్ని కేబినెట్‌ నిర్ణయాలు.. 
సుంకిశాల నుంచి హైదరాబాద్‌కు అదనంగా 33 టీఎంసీల నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు రూ. 2,214.79 కోట్లు మంజూరు. ∙పోడు భూముల సమస్య పరిష్కారానికి ఆయా జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలో రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖలతో ప్రతి జిల్లాలో సమన్వయ సమావేశాల నిర్వహణకు నిర్ణయం. ∙జీహెచ్‌ ఎంసీలో 5 నుంచి 15 వరకు.. ఇతర కార్పొరేషన్లలో 5 నుంచి 10 వరకు కో–ఆప్షన్‌ సభ్యుల సంఖ్య పెంచాలని తీర్మానం. ∙రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఫారెస్టు వర్సిటీకి కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం. ∙కొత్త జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణాలకు 21 జిల్లా కేంద్రాల్లో స్థలాల కేటాయింపునకు తీర్మానం. ∙భద్రాచలంలో ముంపు ప్రాంతాల్లోని 2,016 కు టుంబాలకు కాలనీలు నిర్మించాలని నిర్ణయం.   

మరిన్ని వార్తలు