సవాళ్లకు తావులేకుండా ఎస్టీ రిజర్వేషన్లు..!

30 Sep, 2022 04:04 IST|Sakshi

10% అమలుపై కసరత్తు ముమ్మరంచేసిన ప్రభుత్వం

శాఖలవారీగా సలహాలు స్వీకరిస్తున్న యంత్రాంగం

న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా జాగ్రత్తలు

దసరా తర్వాత లేదా దీపావళి కానుకగా ఉత్తర్వులు!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ప్రస్తుతమున్న 6 శాతం నుంచి 10 శాతానికి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌గిరిజన మహాసభ వేదికగా వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పెంపు మార్గదర్శకాల జారీలో భాగంగా అన్ని శాఖల నుంచి ప్రభుత్వం సలహాలు స్వీకరిస్తోంది. ముఖ్యంగా రిజర్వేషన్ల పెంపు వల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా ఈ అంశాన్ని పరిశీలించాలని న్యాయశాఖకు సూచించింది.

‘పొరుగు’ మోడల్‌ను అనుసరిస్తూ...
రాష్ట్రంలో ప్రస్తుతం రిజర్వేషన్లు 50 శాతం పరిధిలోనే ఉన్నాయి. గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచితే అవి 54 శాతానికి పెరుగుతాయి. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ఏ ప్రాతిపదికన 50 శాతం సీలింగ్‌ను దాటి రిజర్వేషన్లు పెంచుకున్నా యనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించింది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన పత్రా లు, నిబంధనలను తెప్పించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికా రులు... ఆ నమూనాను అనుసరించొచ్చా లేదా అని పరిశీలిస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తవని భావిస్తే పొరుగు రాష్ట్రాల ఫార్ములాను తెలంగాణలోనూ పాటించే అవకాశం ఉంది.

ఇతర వర్గాలకు నష్టం లేకుండా..
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై పలుమార్లు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి... కోటా పెంపు వల్ల ఇతర వర్గాలకు నష్టం జరగొద్దనే సూత్రంతో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. మరో మారు పరిశీ లించిన అనంతరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని ఓ ఉన్నతాధికారి పేర్కొ న్నారు. ఈ లెక్కన దసరా తర్వాత లేదా దీపావళి కానుక గా గిరిజన రిజర్వేషన్ల పెంపు ఉత్త ర్వులను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల విశ్వసనీయ సమాచారం. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ–25, ఎస్సీ–15, ఎస్టీ–6, మైనారిటీ– 4 శాతంగా రిజర్వేషన్లు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు