రేపట్నుంచే కొనుగోళ్లు

14 Apr, 2022 01:59 IST|Sakshi
బుధవారం యాసంగి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి గంగుల

వరి కోతలు ప్రారంభమైన జిల్లాల్లో షురూ: గంగుల

ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో పంట సొమ్ము జమ

60 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి

65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేంద్రాలకు రావచ్చని అంచనా

పౌరసరఫరాల శాఖ మంత్రి కమలాకర్‌ వెల్లడి

సాక్షి , హైదరాబాద్‌:  కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినప్పటికీ, రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవతా దృక్పథంతో యాసంగి ధాన్యం కొనుగోలుకు ముందుకొచ్చారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయన్నారు. శుక్రవారం నుంచి కొనుగోళ్ల ప్రక్రియ మొదలుకాబోతుందని తెలిపారు. యాసంగి కొనుగోళ్లపై బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి.. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. పౌరసరఫరాలు, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీఎంలు, డీఎస్‌ఓలు, పోలీస్‌ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను మొదలుపెట్టాలని ఆదేశించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

నెలాఖరుకు కోతలు ముమ్మరం 
ఇప్పటికే వరి కోతలు ప్రారంభమైన నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట వంటి జిల్లాల్లో అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ఏప్రిల్‌ చివరి వరకు కోతలు ముమ్మరమవుతాయని, మే 10వ తేదీ తరువాత అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చేరుకుంటుందని అన్నారు. 60 రోజుల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని, ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమచేయడం జరుగుతుందని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన సొమ్ము రూ.15 వేల కోట్ల వరకు బ్యాంక్‌ గ్యారంటీ ద్వారా సమకూర్చుకోనున్నట్లు చెప్పారు.  

సరిహద్దుల్లో చెక్‌పోస్టులు.. 
తెలంగాణ చుట్టూ ఉన్న 4 రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చర్యలకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి కమలాకర్‌ చెప్పారు. రాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్‌ శాఖ ద్వారా 51 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయశాఖ సాగు లెక్కలు, పంట దిగు బడి అంచనాలకు అనుగుణంగా సాగైన 36 లక్షల ఎకరాల నుంచి 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. ఎకరాకు 28 క్వింటాళ్లలోపు ధాన్యం మాత్రమే దిగుబడిగా వ్యవసాయ శాఖ ఇచ్చిన లెక్కల మేరకే కొనుగోళ్లు జరుపుతామన్నారు.  

కేంద్రంలో అమ్మడం వరకే రైతు బాధ్యత.. 
రైతు ఆధార్‌ కార్డుతో లింకైన పట్టాదారు పాస్‌ పుస్తకం ద్వారానే కొనుగోళ్లు సాగుతాయని, డాష్‌ బోర్డు విధానంలో ఏరోజుకారోజు ధాన్యం సేకరణ లెక్కలు అందుతాయని గంగుల చెప్పారు. రైతుకు మిల్లర్‌తో ఎలాంటి సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మడం వరకే రైతు బాధ్యతగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.  
కొత్తగా 7.50 కోట్ల గన్నీబ్యాగులు కావాలి.. 
రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే 6 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలకు 15 కోట్ల గన్నీబ్యాగులు అవసరమవుతాయన్నారు. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ వద్ద 1.60 కోట్ల గన్నీబ్యాగులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న పాత బ్యాగులు పోగా, కొత్తగా 7.50 కోట్లు కావాలని అన్నారు. 

కేంద్రం పారిపోతే కేసీఆర్‌ ముందుకొచ్చారు
►  కేసీఆర్‌ మెడలు వంచి ధాన్యం కొనేట్లు చేశా మని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పడం సిగ్గుచేటని గంగుల విమర్శించారు. చేతగాని కేంద్రం తన బాధ్యత నుంచి పారిపోతే, మానవత్వంతో కేసీఆర్‌ రైతుల కోసం వేల కోట్ల నష్టాన్ని భరించి ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ధాన్యం కొనుగోలు విషయంలో అవగాహన లేకుం డా మాట్లాడుతున్నారని విమర్శించారు. 

మరిన్ని వార్తలు