చీర్లవంచ వద్ద భారీ వారధి! రాజమండ్రి తరహాలో డబుల్‌ వంతెనకు శ్రీకారం

14 Aug, 2022 03:30 IST|Sakshi
రాజమండ్రిలోని బ్రిడ్జి (ఫైల్‌) 

పైన వాహనాలు, కింద రైలు వెళ్లేలా ఏర్పాటు

ఆగస్టు 15న ప్రకటన చేయనున్న రాష్ట్రప్రభుత్వం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ వద్ద మిడ్‌మానేరు ప్రాజెక్టు మీదుగా భారీ వారధి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరినదిపై రాజమండ్రి వద్ద నిర్మించిన భారీవంతెనను స్ఫూర్తిగా తీసుకుని దీన్ని నిర్మించతలపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ నిర్మాణ బాధ్యతను పర్యవేక్షిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని బృందం.. వంతెన నిర్మాణ డిజైన్లను ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు చూపించడం, ఆయన కొన్నిటికి సూత్రప్రాయ అంగీకారం తెలిపిన నేపథ్యంలో ప్రాజెక్టు పనిని ప్రారంభించారు.

డబుల్‌ వంతెన, ఆకట్టుకునే రూపం!
ఈ వంతెన రాష్ట్రంలో మిగిలిన వంతెనల కంటే భిన్నంగా, నాణ్యమైనదిగా, డిజైన్‌లో ఆకట్టుకునేలా ఉంటుందని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ ‘సాక్షి’తో చెప్పారు. వంతెన రెండు అంతస్తులుగా ఉంటుందని, పైభాగంలో బస్సులు, లారీలు తదితరాలు వెళ్లేందుకు రోడ్డుతో కూడిన మార్గం, కింద కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైలు వెళ్లేలా ప్రత్యేక రైల్వేట్రాక్‌తో వంతెన నిర్మిస్తామన్నారు. కేంద్రంతోపాటు, దక్షిణమధ్య రైల్వే జీఎం కూడా దీని నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని వివరించారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి సైతం ఎంతో దోహదపడుతుందన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. రాజమండ్రి వారధిలో కింద ఉన్న రైలు వంతెన 2.8 కి.మీ.లు, కాగా పైనున్న రోడ్డు వంతెన 4.1 కి.మీ. ఉంటుంది. చీర్లవంచ వంతెనలో రైలు, రోడ్డు వంతెన ఎన్ని మీటర్లు ఉంటుందన్న సాంకేతికాంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. డబుల్‌ వంతెన కడితే బహుళార్థ సాధక ప్రాజెక్టు అవుతుందన్న సీఎం కేసీఆర్‌ సూచనలతో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఈ బ్రిడ్జి పనులకు దాదాపుగా అన్నిరకాల అనుమతులు వచ్చినట్లే. ప్రభుత్వం ఆగస్టు 15న ప్రకటించనున్న అనంతరం టెండర్లు పిలవనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు