ఇంటికి హక్కు.. ఖజానాకు కిక్కు.. తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో చర్చ?

20 Feb, 2023 01:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లు లేని ఇళ్లు, నిర్మాణాలను క్రమబద్దీకరించడంతోపాటు.. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఇళ్లు, నిర్మాణాలను ఎలా క్రమబద్ధీకరించాలి, ఇందుకోసం ఎలాంటి విధానాన్ని అనుసరించాలన్న దానిపై వారం రోజులుగా కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సేకరించిన వివరాలను పరిశీలించేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘం (కేబినెట్‌ సబ్‌ కమిటీ) సోమవారం సమావేశం కానుంది.

ఇళ్లు, నిర్మాణాల క్రమబద్ధీకరణతోపాటు ఈ హక్కుల కల్పన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునే దిశగా చేపట్టాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నట్టు తెలిసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలపై ఆదాయార్జన శాఖల అధికారులతోనూ సోమవారమే కేబినెట్‌ సబ్‌ కమిటీ విడిగా సమావేశం కానుంది. రెండు కీలక అంశాలపై ఒకేరోజు సబ్‌ కమిటీ భేటీలు జరుగుతుండటంతో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ప్రభుత్వ స్థలాల నుంచి సాదాబైనామాల దాకా.. 
ఈ నెల 13న జరిగిన కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లు లేని ఇళ్లు, నిర్మాణాలను క్రమబద్ధీకరించడంతోపాటు.. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై చర్చించారు. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, ఇంటి పన్ను రశీదులు లేని ఇళ్లు, నిర్మాణాల వివరాలను మొత్తం 12 కేటగిరీల్లో రెవెన్యూ శాఖ సేకరించింది. ఇందులో ప్రభుత్వ స్థలాలు, సాంఘిక సంక్షేమశాఖ సేకరించిన భూములు, సీలింగ్‌ భూములు, ఆబాదీ/గ్రామకంఠం, దేవాదాయ, వక్ఫ్, శిఖం/ఎఫ్‌టీఎల్, పలు శాఖలకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలు, పలు సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వం లీజుకిచ్చిన భూములు, నోటరీలు మాత్రమే ఉన్న భూములు, సాదాబైనామా లావాదేవీలు జరిగిన భూములు, ఇతర కేటగిరీల స్థలాలు ఉన్నాయి. ఈ కేటగిరీల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతోపాటు గ్రామాల నుంచీ వివరాలను పంపాలని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్దేశిత ఫార్మాట్‌ పంపగా.. తహసీల్దార్లు ఆ వివరాలను సేకరించి అందజేశారు. 

12.5 లక్షల నిర్మాణాలు? 
కొన్నిరోజులుగా రెవెన్యూ యంత్రాంగం సేకరించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు లేని ఇళ్లు, నిర్మాణాలు 12.5 లక్షల వరకు ఉన్నట్టు తేల్చారు. రెవెన్యూ డివిజన్ల వారీగా పరిశీలిస్తే.. ఒక్కో రెవెన్యూ డివిజన్‌లో 15వేల నుంచి 17 వేల వరకు ఇలాంటి నిర్మాణాలు ఉంటాయని క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం అంచనా వేసింది. మొత్తంగా 60శాతానికి పైగా నిర్మాణాలు గ్రామ కంఠాలు, ఆబాదీ భూముల్లోనే ఉన్నాయని.. అలా ఉన్నవాటి సంఖ్య ఏడున్నర లక్షల వరకు ఉంటుందని సమాచారం.

ఇక గ్రామాలు, పట్టణాల్లో కలిపి ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు, ఇతర నిర్మాణాలు కలిపి మరో రెండున్నర లక్షలు (16–20 శాతం) ఉండవచ్చని.. మిగిలిన కేటగిరీల్లో మరో 2–3 లక్షల వరకు రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లు లేని ఇళ్లు, నిర్మాణాలు ఉన్నాయని అంచనా. ప్రస్తుతానికి తమ దగ్గర ఉన్న సమాచారం మేరకు ఈ లెక్కలు వేశామని.. సమగ్రంగా పరిశీలన చేస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. గత సోమవారం జరిగిన కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో ఈ డేటా సేకరణకు నిర్ణయం తీసుకున్నారని.. ఈ వారం రోజుల్లో 20 జిల్లాల నుంచే పూర్తి సమాచారం వచ్చిందని, మరికొన్ని జిల్లాల నుంచి అందాల్సి ఉందని అంటున్నాయి. 

రెగ్యులరైజ్‌ చేసేదెలా? 
దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న ఇళ్లు, ఇతర నిర్మాణాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు లేకుంటే.. వాటిని క్రమబదీ్ధకరించడం ఎలాగన్న దానిపై సోమవారం జరిగే కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రమబద్దీకరించాల్సిన ఇళ్లు, నిర్మాణాలు ఎన్ని ఉంటాయి? వాటిని క్రమబద్ధీకరించేందుకు ఉన్న అవకాశాలేమిటన్న వివరాలను ఇప్పటికే సేకరించినట్టు తెలిసింది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులతో చర్చించనున్న కేబినెట్‌ సబ్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం.

అయితే జీవో 58, 59 (పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాల్లో కట్టుకున్న నివాసాల క్రమబదీ్ధకరణ) మాదిరిగా స్థలాల ప్రభుత్వ విలువ ఆధారంగా సీలింగ్‌ నిర్ణయించి.. చదరపు గజాల లెక్కన ఫీజు వసూలు చేసి క్రమబద్దీకరించాలా? లేక ప్రతి ఇల్లు/ నిర్మాణానికి గ్రామాలు/పట్టణాల వారీగా గంపగుత్తగా రుసుము నిర్ణయించి క్రమబదీ్ధకరించాలా? అన్న దానిపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. సాదాబైనామాలు, నోటరీ (జీహెచ్‌ఎంసీ పరిధిలో) భూముల విషయంలోనూ క్రమబదీ్ధకరణకు అవకాశాలను పరిశీలించనున్నట్టు సమాచారం. ఈ అన్ని అంశాలపై సబ్‌ కమిటీ తీసుకునే నిర్ణయాలను సిఫార్సుల రూపంలో ప్రభుత్వానికి నివేదికగా అందించనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ఆ సిఫార్సులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యక్తిగతంగా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని.. క్రమబదీ్ధకరణ కటాఫ్‌ తేదీని, దరఖాస్తు గడువును త్వరలో ప్రకటించవచ్చని అంటున్నాయి. 

బూమరాంగ్‌ అవుతుందా? 
ప్రభుత్వ స్థలాలు, గ్రామ కంఠాలు, ఇతర భూముల్లోని ఇళ్లు, నిర్మాణాల క్రమబద్దీకరణ అంశం బూమరాంగ్‌ అవుతుందా అనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. గతంలో పట్టణాలు, గ్రామాల్లోని ఓపెన్‌ ప్లాట్లు, నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌ పథకాలను ప్రకటించింది. రూ.1,000 చెల్లించి వ్యక్తిగతంగా దరఖాస్తులు చేసుకోవాలని.. తర్వాత నిర్దేశిత ఫీజు చెల్లించి స్థలాలు, భవనాలను క్రమబదీ్ధకరించుకోవచ్చని పేర్కొంది. ప్రభుత్వ ప్రకటనతో లక్షల్లో దరఖాస్తులు వచ్చినా.. తమ భూములు, భవనాలపై ప్రభుత్వానికి మళ్లీ ఫీజు ఎందుకు చెల్లించాలని ప్రజల నుంచి ప్రతికూల అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలో ఆ దరఖాస్తులను ఎటూ తేల్చకుండా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఇప్పుడు మళ్లీ ఇళ్లు, నిర్మాణాల క్రమబదీ్ధకరణ చేపడితే.. ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే చర్చ జరుగుతోంది. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా క్రమబదీ్ధకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి, అదే సమయంలో ఆదాయం సమకూర్చుకోవడానికి గల అవకాశాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించనున్నట్టు తెలిసింది.  

ఆదాయ వనరులపెంపుపైనా నజర్‌ 
సోమవారమే మరో ప్రధాన అంశంపై రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల పెంపుపై కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీ కానుంది. పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం పెంపునకు మార్గాలపై ఆర్థిక, జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, మైనింగ్‌ తదితర శాఖల అధికారులతో ప్రత్యేకంగా చర్చించనుంది.ఇందులో ప్రభుత్వ భూముల వేలం, విలువైన అసైన్డ్‌ భూముల సేకరణ, రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్, దిల్‌ వంటి సంస్థల చేతుల్లో ఉన్న ఆస్తుల అమ్మకాలు తదితర అంశాలను పరిశీలించి.. ఆదాయం పెంచుకునే మార్గాలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. 

>
మరిన్ని వార్తలు