2.17లక్షల మందికి షాదీముబారక్‌! 

24 Sep, 2022 01:55 IST|Sakshi

ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.1,751 కోట్లు ఖర్చు 

ప్రస్తుత వార్షిక సంవత్సరంలో రూ.300 కోట్లు కేటాయింపు 

గణాంకాలు విడుదల చేసిన మైనార్టీ సంక్షేమ శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్లో షాదీముబారక్‌ కింద 2.17లక్షల మందికి ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ నివేదికను విడుదల చేసింది. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,751 కోట్లను ఖర్చు చేసినట్లు పేర్కొంది. 2022–23 వార్షిక ఏడాదిలో ఈ పథకం కోసం రూ.300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్లు వెల్లడించింది. షాదీముబారక్‌ పథకంతో మైనార్టీ వర్గాల్లో బాల్యవివాహాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆ శాఖ నివేదికలో పేర్కొంది. 

విద్యాభివృద్ధికోసం గురుకులాలు 
మైనార్టీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గురుకుల విద్యా సంస్థలను అందుబాటులోకి తీసుకొచ్చిందని అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ వెల్లడించింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 12 పాఠశాలలు మాత్రమే ఉండగా...ఇప్పుడు వాటి సంఖ్య 206కు చేరిందని తెలిపింది. ఈ పాఠశాలల్లో మొత్తం 1.14లక్షల మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

విదేశీ ఉన్నతవిద్య పథకం కింద ముఖ్యమంత్రి ఉపకార వేతనాల కింద ఇప్పటివరకు రూ.6.30 కోట్ల ఆర్థిక సహకారాన్ని మైనార్టీ విద్యార్థులకు అందించామని, 2022–23 ఆర్థిక ఏడాదికి గాను రూ.100 కోట్లను కేటాయించినట్లు వెల్లడించింది. రూ.40కోట్లతో నాంపల్లిలో అనీస్‌ –ఉల్‌ –గుర్బా అనాథ శరణాలయాన్ని పునర్నిర్మిస్తున్నట్లు వివరించింది. మసీదుల్లో ప్రార్థనాదికాలు నిర్వహించే 10 వేలమంది ఇమాం, మౌజంలకు నెలకు రూ.5 వేలచొప్పున గౌరవవేతనం అందిస్తోందని, రంజాన్‌ కానుకగా 4.65లక్షల మందికి, క్రిస్మస్‌ పండుగకు ఏటా సుమారు 5లక్షల మందికి కొత్త బట్టలను కానుకగా అందిస్తున్నట్లు ఆ శాఖ వివరించింది.     

మరిన్ని వార్తలు