ప్రైవేట్‌ టీచర్ల ఖాతాల్లో రూ.41 కోట్లు 

25 May, 2021 03:16 IST|Sakshi

 ఈ కార్యక్రమంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది: మంత్రి సబిత  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సృష్టించిన సంక్షోభంతో తీవ్ర ఇబ్బందుల పాలైన ప్రైవేట్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు, సిబ్బంది ఆకలి బాధలు తీర్చి దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్‌ స్కూళ్ల బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అందిస్తున్న రూ. 2 వేల ఆపత్కాల సహాయాన్ని వ్యక్తిగత అకౌంట్లకు జమ చేసే కార్యక్రమాన్ని సోమవారం ఆమె ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ప్రారంభించారు. మే నెలకు సంబంధించి 2,04,743 మంది టీచర్లు, సిబ్బంది అకౌంట్లలో రూ. 40,94,86,000లను జమ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రైవేటు స్కూల్‌ టీచర్లు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులను పెద్దమనసుతో అర్థం చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా ఆశాజనకంగా లేక పోయినా వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. స్కూళ్లు తిరిగి తెరిచే వరకు ప్రైవేట్‌ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వ సాయం కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు. కరోనా సమయంలో ప్రత్యేక ఛానళ్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు డిజిటల్‌ తరగతులను నిర్వహించడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పాఠశాల విద్యా డైరెక్టర్‌ దేవసేన తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు