ఇంగ్లిష్‌ మీడియం చదువు.. అందరి చూపు సర్కారీ స్కూళ్ల వైపు! 

4 Jun, 2022 04:23 IST|Sakshi

ఇంగ్లిష్‌ మీడియంపై విద్యార్థుల్లో ఆసక్తి.. తల్లిదండ్రుల్లో ఆత్రుత 

80 వేలమంది టీచర్లకు ఆంగ్లంపై శిక్షణ 

మరికొంత శిక్షణ కావాలంటున్న టీచర్లు 

సాక్షి, హైదరాబాద్‌: ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతున్నందున విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు దృష్టి సారించారు. ‘ఉన్న ఊళ్లోనే ఇంగ్లిష్‌ చదువు దొరుకుతుంటే, ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తూ పట్టణాల్లో ఉండటమేమిటీ?’అనే ఆలోచన చాలామందిలో కన్పిస్తోంది. దీంతో సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలో ఇంగ్లిష్‌ మీడియం గురించి పెద్దసంఖ్యలో ప్రభుత్వబడులను సంప్రదిస్తున్నారని విద్యాశాఖ చెబుతోంది. ‘ఇంగ్లిష్‌ అత్యవసర భాషగా ఇప్పటికే అన్నివర్గాలూ గుర్తించాయి. బోధనలో వెనక్కి తగ్గే అవకాశమే లేదు’అని వరంగల్‌కు చెందిన శాంతికుమార్‌ అనే ఉపాధ్యాయుడు అంటున్నారు.  

శిక్షణలో చిత్తశుద్ధి ఎంత? 
రాష్ట్రంలో 26,072 ప్రభుత్వ స్కూళ్లున్నాయి. ఇందులో 1–10 తరగతులు చదివేవారు 20 లక్షలమంది ఉంటారు. ప్రజల్లో స్పందన చూస్తుంటే ఈసారి కనీసం 2 లక్షలమంది కొత్తగా సర్కారు స్కూళ్లల్లో చేరే వీలుందని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ప్రస్తుతం 1.06 లక్షల మంది టీచర్లు ఉండగా, ఇంకా 21,500 ఖాళీలున్నాయి. ప్రేమ్‌జీ వర్సిటీ శిక్షణ కన్నా ముందు 60,604 మంది మాత్రమే ఇంగ్లిష్‌ మీడియం చెప్పగలిగే టీచర్లున్నారని గుర్తించారు.

ప్రస్తుతం 80 వేల మందికి ప్రేమ్‌జీ వర్సిటీ ద్వారా ఆంగ్ల బోధనపై నెల రోజులపాటు శిక్షణ ఇప్పించారు. అయితే తెలుగు నేపథ్యం నుంచి వచ్చిన టీచర్లకు నెలరోజుల శిక్షణ సరిపోదనే భావన వ్యక్తమవుతోంది. ‘శిక్షణకాలంలో ఇంగ్లిష్‌ భాష ద్వారా భావాన్ని వ్యక్తం చేసే తరహాలో వీడియోలు ప్రదర్శించారు, దీంతోపాటే సంభాషణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే బాగుండేది’అని ఆదిలాబాద్‌కు చెందిన కుమార్‌ వర్థన్‌ వ్యాఖ్యానించారు. 

ఆంగ్లం అంత కష్టమేమీ కాదు 
ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంగ్లిష్‌పై విద్యార్థులు పట్టు సాధించడం ఈ తరంలో పెద్ద సమస్యేమీ కాదు. స్మార్ట్‌ ఫోన్‌ వాడని, ప్రతి దానికీ గూగుల్‌ సెర్చ్‌ చేయని పిల్లలున్నారా? ఫస్ట్‌ క్లాస్‌ నుంచే ఈ అలవాటు ఉంది. నిజానికి మనకు తెలియకుండానే 40 శాతం ఇంగ్లిష్‌ వాడకం అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్‌ భాష నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అనుమానాలు లేకుండా ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపడితే, క్రమంగా సమస్యలు సర్దుకుంటాయి.  
–స్వామి శితికంఠానంద, డైరెక్టర్, వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లాంగ్వేజెస్‌

బోధించే స్కిల్స్‌ ఉన్నాయి
ఉపాధ్యాయుల్లో బోధించే నైపుణ్యం ఉంది. తెలుగు మీడియం నుంచి వచ్చినా, మారిన ప్రపంచంలో ఎంతోకొంత ఇంగ్లిష్‌ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకపోతే బోధించేటప్పుడు భయం బ్రేకులు వేస్తోంది. మొదటిదశ శిక్షణలో ఇది కొంత దూరమైంది. మరో దఫా 5 వారాలు శిక్షణ ఉంటుంది. కాబట్టి, టీచర్లందరూ క్రమంగా ఆంగ్లంలో బోధించగలరు. 
–చెరుకు ప్రద్యుమ్న కుమార్, ప్రభుత్వ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌ కేంద్రం కో ఆర్డినేటర్‌  

మరిన్ని వార్తలు