‘రాబడి’ శాఖల్లో.. బదిలీల కదలిక!

15 Sep, 2022 02:51 IST|Sakshi

ఏళ్లకేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వారి ట్రాన్స్‌ఫర్లకు రంగం సిద్ధం 

రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, భూపరిపాలన, పన్నుల శాఖల్లో అమలు 

సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ప్రక్రియపై దృష్టి 

రిజిస్ట్రేషన్లు, పన్నుల శాఖల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన ‘కలెక్షన్‌ కింగ్స్‌’! 

రాబడి శాఖలు కావడంతో కుదురుకునేందుకు సమయం పట్టే అవకాశం 

మార్చిలోపు అనుకున్న ఆదాయం రావాలంటే ఐదారు నెలల ముందే బదిలీలు తప్పనిసరి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే కీలక శాఖల్లో బదిలీలకు రంగం సిద్ధమైంది. ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్నవారికి స్థాన చలనం కల్పించేందుకు కసరత్తు జరుగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, భూపరిపాలన, పన్నుల శాఖల్లో త్వరలోనే బదిలీలు జరగనున్నట్టు తెలిపాయి.

ప్రభుత్వ పాలన, ఆదాయ సమీకరణలో కీలకంగా వ్యవహరించే ఈ నాలుగు శాఖల్లో చాలా కాలం నుంచి బదిలీలు లేకపోవడం, పదోన్నతులు, సర్దుబాటు ప్రక్రియ క్రమంగా కొలిక్కి వస్తుండటం, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం నేపథ్యంలో.. బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్టు సమాచారం. 

ఒక్కొక్కటిగా.. ఓ కొలిక్కి 
రాష్ట్ర ఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో బదిలీలు జరిగి చాలాకాలం అవుతోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానికత ప్రాతిపదికన ఇటీవలి కాలంలో జరిగిన మల్టీజో­నల్, జోనల్, జిల్లా స్థాయి బదిలీలు, అప్పుడప్పుడు పదోన్నతులు వచ్చినప్పుడు చేసే బదిలీలు మాత్రమే జరి­గాయి. కానీ పూర్తిస్థాయి సాధారణ బదిలీలు జరగలేదు. రిజిస్ట్రేషన్ల శాఖలో అయితే దశాబ్ద కాలం నుంచీ ఒకేచోట పనిచేస్తున్న సబ్‌రిజిస్ట్రార్లు కూడా ఉన్నారు.

పన్నుల శాఖలో కూడా ఏళ్ల తరబడి పాతుకుపోయిన ‘వసూల్‌ రాజా’లు కీలక ప్రాంతాలను అంటిపెట్టుకుని వదలడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణ బదిలీలు లేకపోవడంతో వారికి ప్రయోజనకరంగా మారింది. పలుచోట్ల అధికారులు కార్యాలయాలకు ðవెళ్లకుండానే.. సీనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి సిబ్బందితో వ్యవహారం నడిపిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇక కీలకమైన భూపరిపాలన శాఖ, ఎక్సైజ్‌ శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇటీవలి పదోన్నతుల సమయంలో కొందరికి స్థాన చలనం కలిగిందే తప్ప.. సాధారణ బదిలీలు లేవు. ఈ శాఖలన్నింటిలో బదిలీలు అనివార్యమనే చర్చ జరుగుతోంది. 

కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు 
నిజానికి చాలా కాలం నుంచీ ఆయా శాఖల ఉన్నతాధికారులు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. బదిలీలపై నిషేధం అమల్లో ఉండటం, ఎత్తివేసినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రక్రియ ముందుకు పడలేదు. ఈ క్రమంలో తాజాగా రిజిస్ట్రేషన్లశాఖ బదిలీలపై దృష్టి సారించింది. సబ్‌ రిజిస్ట్రార్లు ఎక్కడెక్కడ, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? వారిపై ఏమైనా కేసులు న్నాయా? చర్యలు పెండింగ్‌లో ఉన్నా­యా? అనే వివరాలను ఉన్నతాధికారులు సేకరించారు.

ఇక పన్నుల శాఖలో వీలైనంత త్వరగా బదిలీల ప్రక్రియ పూర్తికావాలని, లేకుంటే ఆదాయ వనరుల సమీకరణపై ప్రభావం పడుతుందని అధికారవర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్దేశించుకున్న రాబడి లక్ష్యం పూర్తి కావాలంటే.. ఐదారు నెలల ముందే బదిలీలు జరగాలని, అధికారులు కొత్త స్థానాల్లో కుదురుకుని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తారని పేర్కొంటున్నాయి. 

ఇప్పుడు జరగకుంటే ఎన్నికల తర్వాతే! 
ఈ ఏడాదిలో బదిలీలు జరగకపోతే.. వచ్చే ఏడాది ఎన్నికలతో బదిలీలకు అవకాశం ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే అసెంబ్లీ ఎన్నికల తర్వాతే బదిలీలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నాయి. ఈ క్రమంలో వచ్చే రెండు మూడు నెలల్లో కీలక ఆదాయ శాఖల్లో బదిలీలు జరుగుతాయనే చర్చ జరుగుతోంది. 

మరిన్ని వార్తలు