విద్యుత్‌ చార్జింగ్‌ స్టేషన్లు పెంచండి

20 Jan, 2024 03:57 IST|Sakshi

సోలార్‌ విద్యుత్‌ వినియోగం, ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి: భట్టి  

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు. పెట్రోల్, డీజిల్‌ వాహనాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు ఇంధన పొదుపులో భాగంగా మార్కెట్లోకి వస్తున్న విద్యుత్‌ వాహనాలకు చార్జింగ్‌ అందించడానికి అన్ని ప్రాంతాల్లో చార్జింగ్‌ స్టేషన్లు నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు.

రాష్ట్రంలో అమలవుతున్న సౌర, పవన, జల విద్యుత్‌ ఉత్పత్తి కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో విద్యుత్‌ కొరత రాకుండా సౌర విద్యుత్‌ను పెద్ద మొత్తంలో వినియోగంలోకి తీసుకురావడానికి రాష్ట్రంలోని జలాశయాలపై సోలార్‌ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్‌ రూఫ్‌టాప్‌ సిస్టం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సంప్రదాయేతర ఇంధన విద్యుదుత్పాదనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వాటిని తక్షణమే పరిశీలించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

ఆ రాయితీలను ప్రజలకు వివరించండి 
రాష్ట్రంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి పెంచడానికి గృహ వినియోగదారులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై అవగాహన కల్పించి ప్రోత్సహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. గృహ వినియోగదారులు ఒక కిలో వాట్‌ సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్యానెల్స్‌ ఏర్పాటు చేస్తే..రూ. 18 వేలు రాయితీ ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని ప్రచారం చేయాలన్నారు. మూడు కిలో వాట్స్‌ నుంచి పది కిలో వాట్స్‌ వరకు కిలో వాట్‌ కు రూ. 9 వేలు లెక్కన ప్రభుత్వం రాయితీ ఇస్తోందనీ, దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు