Telangana: ఆర్టీసీ, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు శుభవార్త..!

1 Jun, 2021 04:19 IST|Sakshi

3 నుంచి డ్రైవర్లకు టీకాలు: ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లందరికీ టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 3వ తేదీ నుంచి రోజుకు సగటు 10 వేల మందికి టీకాలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. టీకా పంపిణీపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు చేసిన సూచనలకు అనుగుణంగా సూపర్‌ స్ప్రెడర్స్‌కు వ్యాక్సిన్లు ఇవ్వాలని సూచించారు. సోమవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి వైద్య ,ఆరోగ్య శాఖ అధికారులతో హరీశ్‌ సమావేశం నిర్వహించారు.

రాష్ట్రానికి మరిన్ని ఎక్కువ టీకా డోసులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌ వచ్చే అంచనాలను సైతం పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, పరిశ్రమలు,ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ, రవాణా శాఖ కమిషనర్‌ యం.ఆర్‌.యం.రావు, వైద్యవిద్య సంచాలకుడు రమేశ్‌ రెడ్డి, ప్రజారోగ్య విభాగ సంచాలకుడు శ్రీనివాస రావు, సీఎం ఓఎస్‌డీ గంగాధర్, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటి వైస్‌చాన్స్‌లర్‌ కరుణాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు