త్వరలో గ్రూప్‌–4 నోటిఫికేషన్‌

14 Nov, 2022 02:47 IST|Sakshi

అగ్నిపథ్‌తో యువతను నిర్వీర్యం చేసిన కేంద్రం

పోలవరం కంటే తర్వాత మొదలుపెట్టినా కాళేశ్వరం పూర్తిచేసుకున్నాం

ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట జోన్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేసేలా అగ్నిపథ్‌ పేరిట ఆర్మీలో కాంట్రాక్టు విధానం తెచ్చిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అలాగే నల్ల చట్టాలను తేవడం, పెట్రో ధరలను ఇష్టానుసారంగా పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు. అలాంటి బీజేపీ తీరును గ్రామాల్లో ఎండగట్టి చర్చ పెట్టి నాయకుల చెంప చెల్లుమనేలా గులాబీ శ్రేణులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్‌ ఉచిత శిక్షణ కేంద్రంలోని పోలీస్‌ ఉద్యోగాల శిక్షణార్థులకు పాలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్‌–4 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనుందని ప్రకటించారు. వాటిలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని కాళేశ్వరం ద్వారా ఒక్కఎకరా కూడా పండలేదని కొంతమంది అవాకులు చెవాకులుగా మా­ట్లాడుతున్నారని మండిపడ్డారు.

ప్రతి గ్రామంలో నిండు­కుండలా బావుల్లో, చెరువుల్లో, చెక్‌ డ్యామ్‌ల్లో­నీరు ఉందన్నారు. గతంలో 5 వేల ఎకరాల్లో పంటల సాగు అయ్యేదని, ఇప్పుడు నా­లు­గింతల సాగు పెరిగిందని తెలిపారు. ఢిల్లీ­లో, గాంధీభవన్‌లో కూర్చొ­ని మాట్లాడితే ఏం తె­లుస్తుందని,గ్రామాల్లోకి వచ్చి చూస్తే కాళేశ్వ­రం గురించి తెలుస్తుందని హరీశ్‌ హితవు పలికారు.  

కొర్రీలతో 30 వేల కోట్ల నిధుల నిలుపుదల
ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు మొదలైన తర్వాత రాష్ట్రంలో ప్రారంభించిన కాళేశ్వరం పూర్తిచేసుకుని ప్రస్తుతం ఫలితాలు పొందుతున్నామని హరీశ్‌ అన్నారు. కానీ అక్కడ ఆ ప్రాజె­క్టు ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొర్రీల పేరుతో రాష్ట్రానికి వచ్చే రూ.30 వేల కోట్ల నిధులను ఆపిందని ఆరోపించారు. మల్లన్నసాగర్‌ ద్వారా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇంటింటికీ తాగునీరు అందించే రింగ్‌మెన్‌ రేపటి తరాలకు వరంగా మారుతుందన్నారు. దేశంలో ఎక్కువగా మాంసాహారం తినే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, 99 శాతం మాంసాహారులు ఉండగా, 1 శాతం శాకా­హారం వారు ఉన్నట్లు హరీశ్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు