రాచకొండ కమిషనరేట్‌లోకి గుండాల ఠాణా 

14 May, 2022 17:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న గుండాల పోలీసుస్టేషన్‌ను రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌లో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాచకొండ పరిధిలోని 3 డివిజన్లలో ఒకటైన యాదాద్రి డివిజన్‌లోని భువనగిరి జోన్‌ కింద ఈ పీఎస్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఈ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులను రాచకొండకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

జిల్లాల పునర్విభజనకు ముందు గుండాల మండలం నల్లగొండ జిల్లాలో ఉండేది. పునర్విభజన సమయంలో గుండాల మండలాన్ని జనగామ జిల్లాలో కలిపారు. ఈ నిర్ణయాన్ని స్థానికులు వ్యతిరేకించడంతో గుండాలను యాదాద్రి జిల్లాలో కలిపారు. గుండాల పోలీస్‌ స్టేషన్‌ను మాత్రం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోనే ఉంచారు. యాదాద్రి–భువనగిరిలోని తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, మోటకొండూర్‌ పోలీస్‌ స్టేషన్లు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఉండగా.. ఒక్క గుండాల మాత్రమే వరంగల్‌ సీపీ పరిధిలో ఇప్పటివరకు ఉన్నది. (క్లిక్: పోలీసు వెబ్‌సైట్‌ ద్వారానే లైసెన్సుల రెన్యువల్‌)

మరిన్ని వార్తలు