TGCET 2021: గురుకుల ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీల ఖరారు

3 Jul, 2021 14:13 IST|Sakshi

18న టీజీసెట్, 25న బీసీఆర్‌జేసీ, బీసీఆర్‌డీసీ సెట్‌లు

ఆగస్టు తొలివారంలోగా ఫలితాల ప్రకటన, అడ్మిషన్లు కొలిక్కి

గతానుభవాల నేపథ్యంలో ఈసారి వేగవంతంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి అర్హత పరీక్షలన్నీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేయడంతో పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో బోధన, అభ్యసన కార్యక్రమాల్లో జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా అడ్మిషన్లు నిర్వహించాలని విద్యాశాఖ సూచించడంతో గురుకుల సొసైటీ అధికారులు చర్యలు వేగవంతం చేశారు.

గురుకుల విద్యాసంస్థలకు సంబంధించి రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఐదో తరగతి అడ్మిషన్ల కోసం టీజీసెట్‌ నిర్వహిస్తున్నారు. 6 నుంచి 10 తరగతుల్లో ఖాళీల భర్తీకి సైతం దరఖాస్తుల ఆధారంగా ప్రవేశ పరీక్షలుంటాయి. ఇక రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం ఆర్‌జేసీసెట్, డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆర్‌డీసీసెట్‌ నిర్వహిస్తున్నారు. 


పది రోజుల్లో ఫలితాలు 

గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకుల సొసైటీలు ఉమ్మడి ప్ర వేశ పరీక్ష(టీజీసెట్‌) నిర్వహిస్తోంది. ఈ నెల 18న టీజీసెట్‌ను నిర్వహించేందుకు గురుకుల సొసైటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. పరీక్షకు వారం ముందు వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు సెట్‌ కన్వీనర్‌ ఇప్పటికే తెలిపారు.  

► ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించి ఈనెల 17న యూజీసెట్‌ నిర్వహిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్లను ఈ ఏడాది మాత్రం విద్యార్థికి పదోతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేశారు.  

► బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో ఫస్టియర్‌ అడ్మిషన్లు, అదే సొసైటీ పరిధిలోని మహిళా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు ఈనెల 25న అర్హత పరీక్షలను వేరువేరుగా నిర్వహిస్తున్నారు. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లో(ఆగస్టు తొలి వారం) ఫలితాలు విడుదల చేసేలా గురుకుల సొసైటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. గతేడాది పరీక్షలు నిర్వహించడంలో తీవ్ర జాప్యం కావడంతో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ఏడాది అలాంటి జాప్యం లేకుండా వీలైనంత త్వరగా పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేలా సొసైటీ అధికారులు ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తున్నారు. 

మరిన్ని వార్తలు