గురుకులం దూరాభారం

7 Jan, 2022 01:32 IST|Sakshi

సర్కారు మంజూరు ఒకచోట .. సొసైటీ నిర్వహణ మరోచోట

అస్తవ్యస్తంగా కొత్త గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి 

శాశ్వత భవనాలు లేక, అద్దె భవనాలు దొరక్క ఇక్కట్లు 

ఒకే ప్రాంగణంలో మూడు, నాలుగు పాఠశాలలు! 

చాలాచోట్ల మౌలిక వసతులు లేక విద్యార్థుల ఇబ్బందులు 

బోధన, భద్రత సమస్యలతో గురుకులాలు సతమతం      

ఈ ఫొటోలో కనిపిస్తున్న భవనం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌లో ఉంది. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ)కు చెందిన మూడు మహిళా డిగ్రీ కాలేజీలు ఈ ఒక్క భవనంలోనే కొనసాగుతున్నాయి. ఈ మూడూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవి కావడం గమనార్హం. వాస్తవానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, బుద్వేల్, హైదరాబాద్‌ జిల్లా మహేంద్రహిల్స్‌లో ప్రభుత్వం వీటిని మంజూరు చేసింది. గురుకుల సొసైటీ మాత్రం ఈ మూడింటినీ ఆయా ప్రాంతాలకు దూరంగా, అంకుషాపూర్‌లోని ఒక మూతబడ్డ ఇంజనీరింగ్‌ కాలేజీని అద్దెకు తీసుకుని నిర్వహిస్తోంది.      

ఈ ఫొటోలోని భవనం శామీర్‌పేటలో ఉంది. ఇక్కడ జగద్గిరిగుట్ట ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను నిర్వహిస్తున్నారు. దీనిని గతేడాది వరకు రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్‌లో నిర్వహించగా.. అక్కడ అద్దె భవనం విషయంలో నెలకొన్న సమస్యతో గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా కాలేజీని సుదూర ప్రాంతానికి తరలించడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ భవనంలో సరైన మౌలిక వసతులు లేవు. ప్రధానంగా తాగునీరుతో పాటు వాడుక నీటికి సైతం కటకట ఉండడం, కనీసం స్నానాలు చేసేందుకు వీల్లేకపోవడంతో రెండు నెలల క్రితం విద్యార్థినులు నిరసనలకు దిగారు. విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో తాత్కాలికంగా వసతులు కల్పించిన సొసైటీ అధికారులు.. ఈ వ్యవహారం రోడ్డెక్కినందుకు కాలేజీలో పనిచేస్తున్న పలువురు అధ్యాపకులు, సిబ్బందిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు.

ఇది నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల గురుకుల కళాశాల. జిల్లాలోని కోడేరు గురుకుల పాఠశాలలో హాస్టల్‌ వసతులు సరిపోక ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులను ఇక్కడికి తరలించారు. బైపీసీలో 40 మంది, సీఈసీలో 40 మంది చొప్పున విద్యార్థులను తరలించడంతో విద్యార్థులు తరగతుల్లో కిక్కిరిసి కూర్చొని పాఠాలు వినాల్సి వస్తోంది. అలాగే అదే పాఠశాల ఆరో తరగతికి చెందిన రెండు సెక్షన్లను వసతులు లేక అధికారులు నాగర్‌కర్నూల్‌ పాఠశాలకు తరలించారు. దీంతో కరోనా సమయంలోనూ తరగతి గదుల్లో ఒక్కో బెంచీకి ముగ్గురు, నలుగురు చొప్పున కూర్చుంటున్నారు. మరోవైపు ఇక్కడ హాస్టల్‌లోనూ రద్దీ పెరిగి ఒకే గదిలో 40 మంది వరకు విద్యార్థులు సర్దుకొని ఉండాల్సి వస్తోంది. అంతేగాకుండా మరుగుదొడ్లు, స్నానాలకు సైతం ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: కేజీ టు పీజీ వరకు నిర్బంధ ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గత నాలుగేళ్లుగా విరివిగా విద్యా సంస్థలను నెలకొల్పుతూ దీనిని అమలు చేస్తోంది. ఈ విధంగా పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటికి అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణంలో, మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది. దీంతో గురుకుల సొసైటీలు ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఎక్కడ అద్దె భవనం దొరికితే అక్కడ అన్నట్టుగా వాటిని ప్రారంభిస్తున్నారు. 

కొత్తవన్నీ అద్దె భవనాల్లోనే...
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో 201 గురుకుల విద్యా సంస్థలున్నాయి. 2014 తర్వాత మరిన్ని గురుకుల విద్యా సంస్థల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విడతల వారీగా కొత్త పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఇప్పటివరకు 724 కొత్త గురుకుల విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. తొలుత పాఠశాల స్థాయి వరకే కొనసాగిన ఈ విద్యా సంస్థలు క్రమంగా జూనియర్‌ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్‌ అయ్యాయి.

ఇలా కొత్తగా ఏర్పాటైన వాటిలో 30 శాతం పాఠశాలలు జూనియర్‌ కాలేజీలుగా మారినట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం శాశ్వత భవనాల దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో కొత్తగా మంజూరైన పాఠశాలలన్నీ అద్దె భవనాల్లోనే ప్రారంభించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతంలో అద్దె భవనాలు లభించకపోవడంతో భవనాలు అందుబాటులో ఉన్న చోట వీటిని ప్రారంభించారు.

ఈ కారణంగానే ఒకచోట ఉండాల్సిన గురుకుల పాఠశాల ఆ పేరుతో మరో ప్రాంతంలో ఉంటోంది. ఏళ్లు గడుస్తున్నా వీటికి శాశ్వత భవనాలను ప్రభుత్వం మంజూరు చేయకపోవడం... మరోవైపు భవనాల యజమానులతో కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ముగియడంతో వాటిని ఎప్పుటికప్పుడు ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలకు తరలించాల్సి వస్తోంది.

శాశ్వత భవనాలు లేక.. అద్దెకు దొరక్క 
గురుకుల పాఠశాల నిర్వహణకు సగటున 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం, విశాలమైన మైదానం ఉన్న భవనం అవసరం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉన్న అద్దె భవనాలు దొరకడం కష్టమే. ఈ క్రమంలో దాదాపు అన్ని సొసైటీలు మూతపడ్డ ఇంజనీరింగ్‌ కాలేజీలు, ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల భవనాలను గుర్తించి యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతబడ్డ చోట ఏర్పాటు చేసిన పాఠశాలలు, కళాశాలలకు భవనం, మైదానం సంతృప్తికరంగా ఉండడంతో ఆ ఒక్కచోటే మూడు, నాలుగు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరగడంతో నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా తాగునీరు, వాడుక నీరు సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి.

కొన్నిచోట్ల బోధన సిబ్బంది కొరత కూడా ఉంది. భద్రత విషయంలో కూడా సమస్యలు తలెత్తుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ ఒకరు చెప్పారు. తల్లిదండ్రులు పిల్లల్ని చూడాలంటే వ్యయ ప్రయాసలకోర్చి పదుల కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి రావాల్సి వస్తోంది. తనకు నెలకు సగటున వెయ్యి రూపాయలు ఖర్చవుతోందని యాచారంలో ఉన్న శంషాబాద్‌ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తండ్రి నాగయ్య ‘సాక్షి’తో వాపోయారు. 

అద్దె భవనాల్లోనే అన్ని సదుపాయాలు
శాశ్వత భవనాలు మంజూరయ్యే వరకు అద్దె భవనాల్లో నిర్వహిస్తామని, అంతవరకు అద్దె భవనాల్లోనే అన్ని సదుపాయాలు కల్పిస్తామని సొసైటీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

పక్కా భవనాలు, మౌలిక వసతులు అత్యవసరం
రాష్ట్ర విద్యా వ్యవస్థను మార్చే స్థాయిలో గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి. అయితే వీటికి పక్కాగా భవనాలు నిర్మించి, సరైన విధంగా మౌలిక వసతులు కల్పించాలి. శాశ్వత భవనాల మంజూరు కోసం ప్రభుత్వానికి చాలాసార్లు వినతులు సమర్పించినప్పటికీ ఫలితం లేదు. సరైన వాతావరణం ఉంటేనే విద్యార్థులు చదువుకోగలుగుతారు. ఆ వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పించాలి. 
– ఆర్‌.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు 

ఇక్కడి గురుకులం మరెక్కడో
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంజూరైన ఎస్సీ గురుకుల పాఠశాలను తొలుత 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నంలో ప్రారంభించారు. అక్కడ బిల్డింగ్‌ సమస్య తలెత్తడంతో అక్కడ్నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాచారానికి తరలించారు.
 హైదరాబాద్‌ జిల్లాలో మంజూరైన మైనార్టీ గురుకుల పాఠశాలల్లో చాలావరకు రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తోల్‌కట్ట వద్ద ఒకేచోట వికారాబాద్‌ డిగ్రీ కాలేజీ, బంట్వారం, మోమిన్‌పేట, చేవెళ్ల పాఠశాలలు కొనసాగిస్తున్నారు.
నల్లగొండ జిల్లా చండూరు, అనుముల, తిప్పర్తి, నిడమనూరు పాఠశాలల్ని ఆయా ప్రాంతాల్లో అద్దె భవనాల కొరతతో నల్లగొండ టౌన్‌లోనే నిర్వహిస్తున్నారు. 

మరిన్ని వార్తలు