ఆగస్టులో  గురుకుల పరీక్షలు!

26 May, 2023 03:44 IST|Sakshi

రేపటితో ముగియనున టీజీటీ దరఖాస్తు ప్రక్రియ 

ఇక అన్ని కేటగిరీలకు పరీక్షల నిర్వహణపై బోర్డు దృష్టి 

ఇతర పరీక్షలతో క్లాష్‌ కాకుండా తేదీల పరిశీలన.. త్వరలో ఇతర బోర్డులతో సంప్రదింపులు 

సాక్షి, హైదరాబాద్‌:  గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ చివరి దశకు చేరింది. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) కొలువులకు దరఖాస్తు గడువు శనివారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో గురుకుల విద్యా సంస్థల్లో అన్ని కేటగిరీల ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ పూర్తికానుంది. అర్హత పరీక్షల విధానానికి సంబంధించిన అంశాలను నోటిఫికేషన్ల ద్వారా అభ్యర్థులకు వివరించిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. ప్రస్తుతం పరీక్షల నిర్వహణపై దృష్టి సారించింది. ఆగస్టు నెలలో ఈ పరీక్షలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన గురుకుల బోర్డు.. తేదీల ఖరారుపై ముమ్మర కసరత్తు చేస్తోంది. 

రెండు నెలల గ్యాప్‌..! 
గురుకుల కొలువులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, అర్హత పరీక్షలకు మధ్య అంతరం గరిష్టంగా రెండు నెలలు ఉండాలని టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్ణయించింది. గురుకులాల్లో ఉద్యోగ ఖాళీల ఖరారు, ఆర్థిక శాఖ అనుమతుల జారీ ప్రక్రియ పూర్తయ్యి దాదాపు ఏడాది పూర్తయ్యింది. తర్వాత ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వడంతో అభ్యర్థులు ఏడాదిగా పరీక్షలకు సన్నద్ధమవుతూ వచ్చారు. తాజాగా దరఖాస్తు ప్రక్రియ అనంతరం సన్నద్ధతకు రెండు నెలల గడువు ఇస్తే సరిపోతుందని నిపుణులు సూచించడంతో బోర్డు అదే నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఆగస్టులో పరీక్షల నిర్వహణపై దృష్టి పెట్టిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. ఏయే తేదీల్లో పరీక్షలు నిర్వహించాలనే అంశాన్ని తేల్చేందుకు చర్యలు చేపట్టింది. ఆయా రోజుల్లో ఇతర ఎలాంటి పరీక్షలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జాతీయ స్థాయి నియామకాల బోర్డులు నిర్వహించే పరీక్షల తేదీలు, ఇతర కీలక నియామకాల బోర్డుల పరీక్షల తేదీలను పరిశీలిస్తోంది. ఆయా పరీక్షలు లేని రోజుల్లో గురుకుల కొలువుల అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. 

నియామక సంస్థలతో ఉమ్మడి భేటీ? 
రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలతో సమన్వయ సమావేశం నిర్వహించాలని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ శాఖల పరిధిలో 80 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేయగా.. ప్రస్తుతం నియామక సంస్థలు అర్హత పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో గురుకులాల్లో 9 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్షలు, ఇతర పరీక్షల తేదీల్లో లేకుండా నివారించేందుకు ఈ సమన్వయ సమావేశం ఉపకరిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ సేŠట్‌ట్‌ పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్, తెలంగాణ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత గురుకుల పరీక్షల తేదీలపై మరింత స్పష్టత రానుంది. 

>
మరిన్ని వార్తలు