గురుకుల సీట్లలో సగం స్థానికులకే!

30 Jul, 2021 02:20 IST|Sakshi

అసెంబ్లీ నియోజకవర్గం యూనిట్‌గా స్థానికత నిర్ధారణ

ఉమ్మడి ప్రవేశపరీక్షలోని మెరిట్‌ ఆధారంగా మిగులు సీట్ల భర్తీ

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల అడ్మిషన్ల విధానంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రతి ఏడాది గురుకుల పాఠశాలల ఐదో తరగతి అడ్మిషన్లలో స్థానిక అసెంబ్లీ నియోజకవర్గంలోని విద్యార్థులకు సగం సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగులు సీట్లను జిల్లాస్థాయిలోని విద్యార్థులతో భర్తీచేస్తారు. ఇంకా మిగిలితే రాష్ట్రస్థాయిలోని విద్యార్థులకు మెరిట్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచే ఈ ఆదేశాలు అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నెల 13న జరిగిన కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఆర్‌ఈఐఎస్‌) సొసైటీలు ఐదో తరగతి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్‌) నిర్వహిస్తున్నాయి.

అనంతరం విద్యార్థులను కేటగిరీలవారీగా విభజించి ఆయా గురుకులాల్లో అడ్మిషన్లు ఇస్తున్నాయి. టీఎండబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ మాత్రం సొంతంగా ప్రవేశపరీక్ష, అడ్మిషన్లు చేపడుతోంది. ప్రవేశపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా 50 శాతం సీట్లు నియోజకవర్గంలోని వారికే కేటాయిస్తారు. సీట్లు మిగిలితే జిల్లాను యూనిట్‌గా, ఇంకా మిగిలితే రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని మెరిట్‌ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. పైరవీలకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా అడ్మిషన్లు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

మూడు నెలలకు ఒకసారి సమీక్ష..
రాష్ట్రంలోని ప్రతి గురుకుల విద్యాసంస్థ మూడు నెలలకోసారి తప్పకుండా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ నిర్వహించి విద్యాసంస్థల పనితీరు, ఇతర సమస్యల్ని చర్చించాలని ప్రభుత్వం ఆదేశించింది. సమావేశానికి నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని సూచించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సొసైటీలతోపాటు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  

మరిన్ని వార్తలు