‘ఒమిక్రాన్‌’పై సబ్‌ కమిటీ 

30 Nov, 2021 04:22 IST|Sakshi

మంత్రి హరీశ్‌ నేతృత్వంలో ఏర్పాటు  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రం లో కరోనా పరిస్థితి పరిశీలన, కోవిడ్‌ టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయడం తదితర అంశాలపై మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఈ సబ్‌ కమిటీకి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చైర్మన్‌గా, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉంటారు. సోమవారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ప్రజారోగ్యం, వైద్యారోగ్యశాఖ సన్నద్ధత, అనుసరిస్తున్న కార్యాచరణ, మందుల లభ్యత, ఆక్సిజన్‌ బెడ్ల సామర్థ్యం తదితర అంశాలపైనా సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని దవాఖానాల్లో మందులు, టీకాలు, అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని ఆరోగ్యశాఖను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, ఈ విషయంలో మంత్రులంతా వారి జిల్లాల్లో సమీక్షలు నిర్వహించి, టీకా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.   

మరిన్ని వార్తలు