త్వరలో 900కు పైగా ఐసీయూ పడకలు

9 Dec, 2021 01:25 IST|Sakshi
120 పడకల కొత్త ఫ్లోర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి 

రూ. 154 కోట్ల ఖర్చుతో ఏర్పాటు: మంత్రి హరీశ్‌రావు

పిల్లల కోసం రాష్ట్రంలో 6 వేల పడకలు సిద్ధం చేస్తాం

కేసీఆర్‌ కిట్ల వల్ల సర్కారు ఆస్పత్రుల్లోనే 52% డెలివరీలు

కొండాపూర్‌ ఆస్పత్రిలో 120 బెడ్ల కొత్త ఫ్లోర్‌ను ప్రారంభించిన మంత్రి

రహేజా మైండ్‌ స్పేస్‌ ఆధ్వర్యంలో బెడ్లు ఏర్పాటు

గచ్చిబౌలి: రాష్ట్రంలో 900కు పైగా ఐసీయూ పడకలు త్వరలో అందుబాటులోకి వస్తాయని, ఇందుకోసం రూ.154 కోట్లు ఖర్చు చేయనున్నామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 27 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కరోనా సమయంలో హైదరాబాద్‌లో 1,300 పడకలను వివిధ సంస్థలు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద సర్కారు ఆస్పత్రుల్లో ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు.

పిల్లల కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 6 వేల పడకలతో పీడియాట్రిక్‌ విభాగాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రహేజా మైండ్‌ స్పేస్‌ ఆధ్వర్యంలో కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రిలో 120 బెడ్లతో ఏర్పాటు చేసిన కొత్త ఫ్లోర్‌ను విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి మంత్రి హరీశ్‌రావు బుధవారం ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.

కొండాపూర్‌ ఆస్పత్రిలో డయాలిసిస్‌ యూనిట్‌
కేసీఆర్‌ కిట్ల పంపిణీని ప్రారంభించాక ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీల శాతం గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం 52 శాతం డెలివరీలు సర్కారు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా డయాలిసిస్‌ యూనిట్లు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొండాపూర్‌ జిల్లా ఆస్పత్రిలోనూ త్వరలో డయాలిసిస్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఆస్పత్రిలో బెడ్ల ఏర్పాటుకు సహకరించిన మైండ్‌ స్పేస్‌ సీఈవోను అభినందించారు. ఆస్పత్రి మెయింటెనెన్స్‌ను కూడా మైండ్‌ స్పేస్‌ తీసుకోవాలని కోరారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల డిమాండ్‌ ఉన్నప్పుడు రహేజా ముందుకొచ్చిందని గుర్తు చేశారు.

100% వ్యాక్సినేషన్‌కు సహకరించాలి
రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తికావాలంటే అందరూ భాగస్వాములు కావాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా నగరంలో కార్పొరేటర్లు తమ పరిధిలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ అందేలా చూడాలన్నారు. రెండు, మూడు సార్లు ఇళ్లకు వెళ్లి ఆరా తీయాలని సూచించారు.

రాష్ట్రంలో రోజూ సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్, కొండాపూర్‌ కార్పొరేటర్‌ హమీద్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు