రిటైల్‌కు రెక్కలొచ్చాయ్‌!

17 Nov, 2020 03:57 IST|Sakshi

రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్న వస్తు, సేవల రిటైల్‌ ధరలు

తెలంగాణలో ద్రవ్యోల్బణం 10.37%.. దేశంలోనే రెండో స్థానం 

దేశ వ్యాప్తంగా అక్టోబర్‌లో 7.61 శాతమే

12 శాతంతో గ్రామీణ తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌ 

కూరగాయలు, ఉల్లి ధరల పెరుగుదలే ప్రధాన కారణం

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వస్తు, సేవల రిటైల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యుడిని ధరాఘాతం తాకుతోంది. జీవనవ్యయం పెరిగి జేబుపై ఆర్థికభారం పడుతోంది. అక్టోబర్‌ నెలలో దేశంలో ద్రవ్యోల్బణం 7.61 శాతానికి చేరుకోగా, తెలంగాణ రాష్ట్రంలో అది ఏకంగా 10.37 శాతానికి ఎగబాకింది. దీంతో ద్రవ్యోల్బణం రేటులో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉంది. గత ఏడాది ఒకనెలతో పోల్చితే (ఉదాహరణకు అక్టోబర్‌ 2019– అక్టోబర్‌ 2020 మధ్య తేడా), ఈ ఏడాది అదేనెలలో వినియోగదారుల ధరల సూచీలో పెరుగుదల రేటునే ద్రవ్యోల్బణం అంటారు.

ద్రవ్యోల్బణం పెరిగినపుడు... ప్రజల జీవన వ్యయం పెరిగిపోతుంది. రూపాయి కొనుగోలు శక్తి తగ్గుతుంది. కేంద్ర గణాంక, ప్రభుత్వ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌పీఐ) అక్టోబర్‌ నెలకు సంబంధించిన ద్రవ్యోల్బణం గణాంకాలను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం 2020 అక్టోబర్‌లో రాష్ట్రంలో ద్రవ్యోల్బణం 10.37 శాతానికి చేరింది. పశ్చిమబెంగాల్‌ 10.89 శాతం ద్రవ్యోల్బణంతో దేశంలో అగ్రస్థానంలో నిలవగా, 10.14 శాతంతో ఒడిశా, 10.03 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.

తెలంగాణ రెండో స్థానంలో ఉండటాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో రిటైల్‌ ధరలు రాకెట్‌ వేగంతో పెరిగిపోయాయని స్పష్టమవుతోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం గత కొంతకాలంగా దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణాన్ని నమోదు చేస్తూ వస్తోంది. గత మార్చి నెలలో దేశంలో ద్రవ్యోల్బణం 5.91 శాతం నమోదు కాగా, 8.12 శాతంతో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది.

పల్లెల్లో బతుకుభారం
గత అక్టోబర్‌లో గ్రామీణ తెలంగాణలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. 11.98 శాతం ద్రవ్యోల్బణం రేటుతో గ్రామీణ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ పట్టణ ప్రాంతాలు 9.05 శాతం ద్రవ్యోల్బణంతో జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచాయి. మరో విధంగా చెప్పాలంటే తెలంగాణ పల్లెల్లో రిటైల్‌ ధరలు దాదాపు 12 శాతం, పట్టణాల్లో 9.05 శాతం పెరిగాయి. ద్రవ్బోల్బణం పెరిగితే రూపాయి విలువ క్షీణించి ప్రజల కొనుగోలు శక్తిని హరిస్తుంది. 

కూరగాయలు, ఉల్లి ధరలే ప్రధానకారణం
ప్రధానంగా కూరగాయలు, ఉల్లి, ఇతర ఆహారపదార్థాల ధరలు అసాధారణంగా పెరగడంతో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయింది. వినియోగదారుల ధరల సూచిక (కన్జ్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌) ప్రకారం గతేడాదితో పోల్చితే ప్రస్తుతం జాతీయ స్థాయిలో కూరగాయల ధరలు 22.51 శాతం, పప్పు ధాన్యాల ధరలు 18.34 శాతం, మాంసం, చేపల ధరలు 18.70 శాతం, గుడ్ల ధరలు 21.81 శాతం, నూనెల ధరలు 15.17 శాతం వరకు పెరిగిపోయాయి.

కరోనా మహమ్మారి నియంత్రణకు లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. చాలా కూరగాయలు కిలో సగటున రూ.60 నుంచి 100 వరకు ఎగబాకాయి. ఇక ఉల్లి ధరలకు రెక్కలు వచ్చి ఒకదశలో కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలికింది. భారీ వర్షాలతో ఉల్లి, కూరగాయల పంటలు దెబ్బతినడంతో మార్కెట్లో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక ధరలు పెరుగుదలకు దారితీసిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 

తెలంగాణలో వరిసాగు పెరడమే కారణం
తెలంగాణ రాష్ట్రం కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు, చేపలు, మాంసం వంటి ఆహార పదార్థాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. స్థానికంగా ఉన్న డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో రాష్ట్రంలో వీటి ధరలు దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా అధికంగా ఉంటున్నాయని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 2011–12లో రాష్ట్రంలో రూ.9,317.47 కోట్ల విలువ చేసే పండ్లు, కూరగాయల ఉత్పత్తి జరగగా, 2017–18 వచ్చేసరికి ఈ ఉత్పత్తుల విలువ రూ.5,737.41 కోట్లకు తగ్గిపోయిందని కేంద్ర గణాంక, ప్రభుత్వ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది.

రాష్ట్రంలో గత దశాబ్దకాలంగా పండ్లు, కూరగాయల ఉత్పత్తి దాదాపు సగానికి తగ్గిపోయిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో వరిసాగు ఏటేటా గణనీయంగా పెరిగిపోతోంది. వివిధ సాగునీటి ప్రాజెక్టుల కింద దశాబ్దాలుగా బీడువారిన లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ ఏడాది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని సరఫరా చేసి స్థిరీకరించారు. గతంలో కూరగాయలు, పప్పుదినుసులు, ఇతర పంటలు పండించిన రైతులు సాగునీరు వచ్చేసరికి వరి సాగువైపు మళ్లారు.

దీంతో ఈ ఏడాది రాష్ట్రంలో కూరగాయల సాగు మరింతగా తగ్గిపోవడంతో... సరఫరా తగ్గి వీటి ధరలు గణనీయంగా పెరిగిపోయాయని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టిన నియంత్రిత పంటల సాగు విజయవంతమై... స్థానిక అవసరాలకు తగ్గట్టు ఇక్కడే కూరగాయలు, పండ్ల ఉత్పత్తులు పెరిగితే ధరలు దిగి వచ్చే అవకాశముంది. 

డిమాండ్‌కు తగ్గట్టు సప్లై లేదు
ఆర్థిక మాంద్యం, కరోనా మహమ్మారి, లాక్‌డౌన్, నిరుద్యోగం కారణంగా ప్రజల జేబుల్లో డబ్బులు లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో కొనుగోలుదారులు లేక డిమాండ్‌ పతనమై ధరలు తగ్గాల్సింది పోయి... పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గట్టు ఆహారపదార్థాల సరఫరా లేకపోవడం ధరలు పెరగడానికి దోహదపడింది. దేశానికే ధాన్య భండాగారంగా పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం, కూరగాయలు, పండ్లు, ఉల్లి, పప్పులు, మసాల దినుసులు, ఇతర ఆహారపదార్థాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతోంది.

ఇతర రాష్ట్రాల్లో వీటికి సంబంధించిన ధరలు కొద్దిగా పెరిగినా తెలంగాణలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోతోంది. ప్రధానంగా పేద, బలహీనవర్గాల ప్రజల జీవనం దుర్భరంగా మారిందని ద్రవ్యోల్బణం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణకు అవసరమైన పండ్లు, కూరగాయలు, పప్పులు వంటి వాటి ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కూరగాయలు, ఉల్లిని పేదలకు సబ్సిడీపై సరఫరా చేయాలి. లేకుంటే పేద ప్రజలకు రెండు పూటల కడుపు నిండా తిండి కూడా లభించదు. 
 – పీఎస్‌ఎం రావు, ఆర్థికవేత్త   

మరిన్ని వార్తలు