సిట్‌ దర్యాప్తు బాగానే ఉంది కదా!: పేపర్‌ లీక్‌ కేసు విచారణ జూన్‌కి వాయిదా వేసిన హైకోర్టు

28 Apr, 2023 11:53 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పేపర్‌ లీక్‌ కేసులో విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. సిట్‌ దర్యాప్తు నిదానంగా సాగుతున్నట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించిన ఉన్నత న్యాయస్థానం.. జూన్‌ 5వ తేదీ వరకు ఈ కేసు విచారణ వాయిదా వేస్తున్నట్లు  శుక్రవారం వెల్లడించింది.

పేపర్‌ లీక్‌ కేసులో ఇవాళ్టి విచారణ సందర్భంగా.. సిట్‌ ఏసీపీ నర్సింగ్‌ రావ్‌ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో.. ఎప్పటిలోపు దర్యాప్తు పూర్తి చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. టీఎస్పీఎస్సీలో ఉన్న అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది అందరినీ విచారించారా?..  ఏ -16 ప్రశాంత్ రోల్ ఏంటి?.  ఈ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుక భర్త డాక్యా నాయక్‌ నుండి డబ్బులు పెట్టీ పేపర్ కొన్న వాళ్ళు.. మళ్ళీ ఎవరికైనా అమ్మారా?.. అంటూ వరుసగా ప్రశ్నలు గుప్పించింది. ఈ క్రమంలో.. సిట్‌ దర్యాప్తు నిదానంగా సాగుతున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది బెంచ్‌. 

అయితే..  సిట్‌ ఏసీపీ నర్సింగ్‌ రావ్‌, అడ్వొకేట్‌ జనరల్‌లు ఆ ప్రశ్నలపై కోర్టుకు వివరణ ఇచ్చారు. వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. ఎప్పటి లోపు దర్యాప్తు పూర్తి చేస్తారని మరోసారి ప్రశ్నించింది. అయితే.. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి రిపోర్ట్  రావాల్సి ఉందని అడ్వొకేట్‌ జనరల్‌ వివరణ ఇచ్చారు.

ఇక కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై.. తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ విచారణ సంతృప్తికరంగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించడంపై కేసు దర్యాప్తు దశలో ఉన్నందున ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది. తదుపరి విచారణ జూన్‌ 5వ తేదీకి వాయిదా వేస్తూ.. ఆ తేదీన పేపర్‌ లీక్‌ కేసు దర్యాప్తుపై స్టేటస్‌ రిపోర్ట్‌ను సమర్పించాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: తెలంగాణలో ఊహకందని స్థాయిలో పంట నష్టం!

>
మరిన్ని వార్తలు