బాలికపై లైంగిక దాడి.. 24 వారాల గర్భం: అబార్షన్‌పై హైకోర్టు కీలక తీర్పు

8 Oct, 2021 08:42 IST|Sakshi
తెలంగాణ హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: సమీప బంధువు లైంగిక దాడితో గర్భం దాల్చిన 16 ఏళ్ల బాలిక గర్భస్థ పిండాన్ని, 48 గంటల్లో తొలగించాలని కోఠి ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. బాలిక జీవించే హక్కు దృష్ట్యా పిండాన్ని తొలగించాలని ఆదేశించే అధికారం తమకుందని తేల్చిచెప్పింది. సీనియర్‌ గైనకాలజిస్ట్‌ పర్యవేక్షణలో మెడికల్‌ పద్ధతి లేదా శస్త్రచికిత్స ద్వారా ఈ పిండాన్ని తొలగించాలని స్పష్టం చేసింది. డీఎన్‌ఏ పరీక్ష చేసేందుకు వీలుగా పిండం కణజాలాన్ని, రక్త నమూనాలను భద్రపర్చాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. బాలికపై లైంగిక దాడికి సంబంధించి నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా పిండం కణజాలాన్ని, రక్త నమూనాలను డీఎన్‌ఏ, ఇతర పరీక్షల కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాలని, ఈ కేసు తుది విచారణ కోసం డీఎన్‌ఏ, ఇతర పరీక్షల రిపోర్టులను భద్రపర్చాలని దర్యాప్తు అధికారికి ఉత్తర్వులు జారీ చేసింది.

బాధితురాలు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే హైకోర్టు లీగల్‌ సర్వీస్‌ అథారిటీ అధికారులు సహకరించి న్యాయబద్ధంగా అందాల్సిన పరిహారాన్ని ఇప్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి ఇటీవల తీర్పునిచ్చారు. ‘లైంగిక దాడితో బాలిక గర్భం దాల్చింది. బాలిక సమ్మతి లేకుండా వచ్చిన ఈ గర్భాన్ని కొనసాగించాలా, తొలగించుకోవాలా అన్న స్వేచ్ఛ సదరు బాలికకు ఉంది. 25 వారాల గర్భంతో ఉంది కాబట్టి గర్భాన్ని తొలగించలేమనడం సరికాదు. గర్భం తొలగించకపోతే భవిష్యత్తులో అనేక తీవ్రమైన మానసిక, శారీరక రుగ్మతల బారిన పడే అవకాశం ఉంది. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కుకు ఇది విఘాతం’అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
చదవండి: Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. రూ.100కే వెయ్యి చైల్డ్‌ పోర్న్‌ వీడియోలతో..

కాగా హైదరాబాద్‌కు చెందిన బాలికపై సమీప బంధువు బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.  బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చూపించగా, 25 వారాల గర్భంతో ఉందని డాక్టర్లు నిర్ధారించారు. 24 వారాల గర్భం దాటితే గర్భస్థ పిండాన్ని తొలగించడానికి చట్టప్రకారం హైకోర్టు అనుమతించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించింది.  

మరిన్ని వార్తలు