ఎన్నికల ర్యాలీలకు అనుమతివ్వడమేంటి?

24 Apr, 2021 01:45 IST|Sakshi

కరోనా ఆంక్షలకు అవి అతీతమా?.. రాష్ట్ర సర్కారుపై హైకోర్టు ఆగ్రహం

బార్లు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌లో ఆక్యుపెన్సీ 50 శాతం కన్నా తగ్గించాలి 

ఆర్టీపీసీఆర్‌ పరీక్ష రిపోర్టు లేకున్నా ఆస్పత్రుల్లో చేర్చుకోవాలి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నా, పెద్ద సంఖ్యలో రోగులు చనిపోతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోం దని హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో వందల మందితో ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిం చింది. కోవిడ్‌ ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలన్న కేంద్రం, ఐసీఎంఆర్‌ ఆదేశాలకు ఎన్నికల ర్యాలీలు అతీతమా అని నిలదీసింది. ఎన్నికల ర్యాలీల కట్టడికి వెంటనే చర్యలు తీసుకోవాలని.. పబ్బులు, బార్లు, క్లబ్స్, ఫంక్షన్‌ హాల్స్, సినిమా హాల్స్, షాపింగ్‌ మాల్స్‌ వంటి జనం గుమిగూడే చోట్ల 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీనే అనుమతించాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, గతంలో, ప్రస్తుతం తాము ఇచ్చిన ఆదేశాల అమలుపై పూర్తి వివరాలతో సోమవారం (27వ తేదీ)నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర సర్కారును ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీ, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్, న్యాయవాదులు వసుధా నాగరాజ్, చిక్కుడు ప్రభాకర్, సి.నరేశ్‌రెడ్డి, జి.పూజిత, కె.పవన్‌కుమార్, ఎం.రంగయ్య తదితరులు పలు సూచనలు చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఉత్తర్వులు జారీచేసింది. 

మృతుల లెక్కలపై అనుమానాలు 
రాష్ట్రంలో కరోనా మృతుల లెక్కలపై ధర్మాసనం అనుమానాలు వ్యక్తం చేసింది. ‘‘ఏప్రిల్‌ 1 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 199 మంది చనిపోయారని, అందులో హైదరాబాద్‌ వారు 64 మంది ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు. ఈ లెక్కలపై అనుమానాలున్నాయి. మృతదేహాలను వారి సంప్రదాయాలకు విరుద్ధంగా మూకుమ్మడిగా దహనం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎందరు కరోనా బాధితుల మృతదేహాలను ఖననం చేస్తున్నారన్న వివరాలు స్మశానాల వద్ద కనిపించేలా ఏర్పాటు చేయండి’’ అని ఆదేశించింది. 

ఆక్సిజన్, రెమిడెసివిర్‌పై స్పష్టత ఇవ్వండి 
కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్‌ విషయంగా అధికారులు చెప్తున్న మాటలు వేర్వేరుగా ఉన్నాయని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఆక్సిజన్‌ నిల్వలు తక్కువగా ఉన్నాయని ఆరోగ్య మంత్రి మీడియాతో చెప్పారు. 350 టన్నుల ఆక్సిజన్‌ కావాల్సి ఉండగా.. 200 టన్నులు మాత్రమే వస్తోందన్నారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో మాత్రం ఆక్సిజన్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని అంటున్నారు. ఈ లెక్కలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి..’’ అని ఆదేశించింది. కరోనా రోగులకు ప్రాణాధారమైన రెమిడెసివిర్‌ ఇంజక్షన్స్‌ను తెలంగాణలోనే తయారు చేస్తున్నా ఇక్కడి రోగులకు అందని పరిస్థితి ఏర్పడిందని ధర్మాసనం పేర్కొంది. ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా ఈ ఇంజక్షన్‌ అందుబాటులో లేదని, తాము ప్రయత్నించినా దొరికే పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది. ఇక్కడి ప్రజల అవసరాల తర్వాతే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలని పేర్కొంది. అసలు రాష్ట్రానికి ఎంత ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నారు, రెమిడెసివిర్‌ ఇంజక్షన్స్‌ను ఏ మేరకు కేటాయిస్తున్నారో నివేదిక సమర్పించాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. 

సాధారణ బెడ్స్‌ను ఆక్సిజన్‌ బెడ్స్‌గా మార్చాలి 
గాంధీ ఆస్పత్రిలో 650 సాధారణ బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయని ఆరోగ్య శాఖ నివేదికలో పేర్కొందని.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాటిని ఆక్సిజన్‌ బెడ్స్‌గా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘అనాధలు, వృద్ధులు, వికలాంగులు, అంధుల వసతి గృహాల్లో ఉన్న వారికి వెంటనే వ్యాక్సిన్‌ ఇచ్చే ఏర్పాట్లు చేయాలి. లాక్‌డౌన్‌ పెడతారనే భయంతో కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. వారికి భరోసా ఇవ్వండి. నివాసం లేని వారికోసం నైట్‌ షెల్టర్స్‌ ఏర్పాటు చేసి భోజన సౌకర్యం కల్పించండి..’’ అని ధర్మాసనం సూచించింది. ఈ సందర్భంగా పలు అంశాలపై పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. ‘108, 104 కాల్‌ సెంటర్స్‌కు రోజూ ఎన్ని కాల్స్‌ వస్తున్నాయి, ఎందరు రోగులను 108 అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రిలో చేరుస్తున్నారు, కంటైన్‌మెంట్‌ జోన్లలో కరోనా రోగులు తిరగకుండా ఏం చర్యలు తీసుకున్నారు, కుంభమేళా నుంచి వచ్చిన యాత్రికులను హోం క్వారంటైన్‌ చేసేలా ఏం చర్యలు తీసుకున్నారు, స్వల్ప లక్షణాలున్న వారిని కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చేర్చే దిశగా తీసుకున్న చర్యలు ఏమిటి?’..తదితర వివరాలు సమర్పించాలని ఆదేశించింది. విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

‘ఆర్టీపీసీఆర్‌’ రిపోర్టు లేకున్నా చేర్చుకోవాలి 
ఆర్టీపీసీఆర్‌ పరీక్ష రిపోర్టు ఉంటేనే కొన్ని ఆస్పత్రుల్లో రోగులను చేర్చుకుంటున్నారని, లేని వారిని చేర్చుకోకుండా  నిరీక్షించేలా చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని హైకోర్టు పేర్కొంది. ‘‘ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు లేకున్నా కరోనా లక్షణాలతో వచ్చే రోగులను వెంటనే చేర్చుకోవాలని ప్రభు త్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశిస్తున్నాం. వ్యాక్సినేషన్‌ నిర్వహణ కోసం, ఆస్పత్రుల్లో మందుల సరఫరాకు అంత రాయం లేకుండా, రోగులకు సాయం చేసేందుకు వీలుగా ప్రభు త్వం అన్ని జిల్లాల్లో 24 గంటల్లోగా నోడల్‌ ఆఫీ సర్లను నియమించి కేంద్రానికి తెలియజేయాలి. అడ్వైజరీ కమిటీ ఏర్పాటు దిశగా ఏం చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఎన్ని పర్యాయా లు సమావేశమైంది? కరోనా కేసుల నియంత్రణ దిశగా ఏం చర్యలు తీసుకుంది? తెలియజేయాలి. రోజూ 40 వేలదాకా ఆర్టీపీసీ ఆర్‌ పరీక్ష లు చేసే సామర్ధ్యం రాష్ట్రంలో ల్యాబ్స్‌కు ఉన్నా.. 20 రోజుల్లో 3.47 లక్షల పరీక్షలే చేశా రు. ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను గణనీయం గా పెంచాలి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.    

మరిన్ని వార్తలు