ఈడీ కేసు నమోదు చేయొచ్చా?: హైకోర్టు 

21 Jan, 2023 02:02 IST|Sakshi

ఎంబీఎస్‌ జ్యువెల్లరీ కేసులో అమికస్‌క్యూరీ నియామకం  

సాక్షి, హైదరాబాద్‌: ఫారెన్‌ ఎక్స్చేంజ్ లో అవకతవకలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసు నమోదు చేయవచ్చో, లేదో తెలియజేయాలని కోరుతూ ఎంబీఎస్‌ కేసులో హైకోర్టు అమికస్‌ క్యూరీని నియమించింది. చట్టవిరుద్ధంగా బంగారం, వజ్రాల కొనుగోళ్లకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రముఖ నగల వ్యాపార సంస్థ ముసద్దీలాల్‌ జెమ్స్‌ అండ్‌ జువెల్లర్స్‌పై అక్టోబర్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సంస్థ కార్యాలయాలు, దుకాణాలు, యజమానుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపి రూ.100 కోట్ల విలువైన బంగారు, వజ్రాల నగలను, మరో రూ.50 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వజ్రాల కొనుగోళ్లకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈడీ కేసును సవాల్‌ చేస్తూ యజమాని సుఖేశ్‌గుప్తా హైకోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేందర్‌ శుక్రవారం విచారణ చేపట్టారు.

అసలు ఫారెన్‌ ఎక్స్చేంజ్ లో తేడాలకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేయవచ్చా?.. ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ క్రైమ్‌గా పరిగణించవచ్చా? అనేది చెప్పాలని అమికస్‌ క్యూరీగా సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డిని న్యాయమూర్తి నియమించారు. కేసు మెటీరియల్‌ అంతా ఆయనకు అందజేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.    

మరిన్ని వార్తలు