న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవాలి

25 Sep, 2022 04:28 IST|Sakshi

ప్రజలు, కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని సూచన 

ఖమ్మం లీగల్‌: న్యాయవ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, దాన్ని న్యాయవాదులు, న్యాయమూర్తులు నిలుపుకోవాలని రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు. న్యాయం అందించే ప్రక్రియలో జరిగే జాప్యాన్ని నివారించడంలో న్యాయమూర్తులు, న్యాయవాదుల పాత్ర కీలకమైందని చెప్పారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో శనివారం నిర్వహించిన న్యాయవాద పరిషత్‌ రాష్ట్ర ద్వితీయ మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సంద ర్భంగా ‘సత్వర న్యాయం–న్యాయవాదుల పాత్ర’ అనే అంశంపై ప్రసంగించారు. కక్షిదారులు, ప్రజలకు సత్వర న్యాయం అందించకుంటే న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. న్యాయాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 19, 20, 21 ప్రకారం అందరికీ సమన్యాయం వర్తిస్తుందని తెలిపారు. కక్షిదారులకు న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు ఉందన్నారు. కష్టపడి పనిచేయాలని, బరువు బాధ్యతలను చిరునవ్వుతో మోయాలంటూ ఇటుకలు మోసే పంజాబీ మహిళ గురించి ప్రస్తావించారు.

15 ఇటుకలను చిరునవ్వుతో మోసే ఆ మహిళ తల మీద మరికొన్ని మోపితే భారం అయినట్లుగా అవుతుందని పెండింగ్‌ కేసుల గురించి ప్రస్తావిస్తూ అన్నారు. సత్వర న్యాయానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. ప్రపంచంలోనే మనదేశ న్యాయవ్యవస్థ గొప్పదని చెప్పారు. ఖమ్మం జిల్లా పరిపాలనా న్యాయమూర్తి టి.వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ సయోధ్య అనేది పురాతన కాలం నుంచి ఉందని, లోక్‌ అదాలత్‌ ద్వారా సత్వర న్యాయం అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ 2010లో తాను రాసిన పుస్తకంలోని సత్వర న్యాయం అనే అంశంపై వివరించానని తెలిపారు. మహాసభలో ఖమ్మం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు, న్యాయమూర్తులు కె.లక్ష్మణ్, ఎన్‌.రాజేశ్వర్‌రావు, బి.నగేశ్, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి, న్యాయవాద పరిషత్‌ బాధ్యులు కె.శ్రీనివాసమూర్తి, కరూర్‌ మోహన్, సునీల్, కె.విజయ్‌కుమార్, ఎస్‌.వెంకటేశ్వర గుప్తా, అన్ని జిల్లాల న్యాయవాద పరిషత్‌ న్యాయవాదులు హాజరయ్యారు.   
 

మరిన్ని వార్తలు