తెలంగాణలో లాక్‌డౌన్‌: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

11 May, 2021 16:05 IST|Sakshi

అకస్మాత్తు నిర్ణయంపై కోర్టు అసహనం

సరిహద్దులో అంబులెన్స్‌లు నిలిపి వేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో రేపటి నుంచి(మే 12) పది రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేపటి నుంచి లాక్‌డౌన్‌ అంటే ఇతర రాష్ట్రాల ప్రజల పరిస్థితి ఏంటని కోర్టు ప్రశ్నించింది. కనీసం వీకెండ్‌ లాక్‌డౌన్‌ ఆలోచన లేకుండా ఇంత అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడం పట్ల కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇంత తక్కువ సమయంలో ఇతర ప్రాంతాల వాళ్లు ఎలా వెళ్తారు అని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్స్‌లను ఎందుకు నిలిపేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. హైదరాబాద్‌ అనేది మెడికల్ హబ్.. ఆరోగ్యం కోసం ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారన్న కోర్టు.. వైద్యం కోసం ఇక్కడికి రావద్దు అని చెప్పడానికి మీకేం అధికారం ఉంది అని ప్రశ్నించింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కోవిడ్‌ పేషెంట్లు ఆర్‌ఎంపీ డాక్టర్ల పిస్ర్కిప్షన్‌తో ఇక్కడికి వస్తున్నారని అందుకే నిలిపివేస్తున్నామని ఏజీ కోర్టుకు తెలిపారు.

అంబులెన్స్‌లపై రేపు నిర్ణయం తీసుకుంటామన్న ఏజీ వ్యాఖ్యలపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. రేపటి వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి అని ప్రశ్నించింది. బార్డర్ వద్ద అంబులెన్స్ నిలిపివేతకు సంబంధించి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అన్న కోర్టు ప్రశ్నకు.. లిఖితపూర్వక ఆదేశాలు లేవన్నారు ఏజీ. ఈ క్రమంలో కోర్టు మరి ఓరల్ ఆర్డర్స్ ఉన్నాయా అని ప్రశ్నించగా.. సీఎస్‌ను అడిగి చెప్తానన్నారు. దాంతో సరిహద్దులో అంబులెన్స్‌లను నిలిపి వేయవద్దని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ సందర్భంగా ఎమర్జెన్సీ పాస్‌లు ఇస్తామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ యధావిధిగా కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది.

చదవండి: కేసీఆర్‌ సర్కారుపై హైకోర్టు ప్రశ్నల వర్షం

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు